టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ దాడులు ప్రారంభమవుతాయని ఇరాన్ విప్లవ సైన్యం (Revolutionary Guard) స్పష్టమైన సమయాన్ని ప్రకటించింది. ఇరాన్ ఇలాంటి చర్యకు పూనుకోవడం ఇదే మొదటిసారి. ఇది ప్రపంచ మార్కెట్‌ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.
18 అమెరికన్ కంపెనీలే లక్ష్యం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేసిన నేపథ్యంలో, దానికి ప్రతీకారంగా అమెరికా కంపెనీలపై విరుచుకుపడతామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ సైన్యం ముఖ్యంగా 18 కంపెనీల పేర్లను ప్రస్తావించింది. వాటిలో:
- మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్.
- బోయింగ్, టెస్లా, IBM, ఇంటెల్ వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి.
పశ్చిమ ఆసియాలో ఈ కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోతాయని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సాగిస్తున్న ‘ఉగ్రవాద చర్యలకు’ బదులుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్లవ సేన ప్రకటించింది.
ఉద్యోగులకు హెచ్చరిక
“ఈ కంపెనీల్లో పనిచేసే వారందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కార్యాలయాలకు దూరంగా ఉండాలి. బుధవారం రాత్రి 8 గంటల నుండి దాడులు మొదలవుతాయి” అని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ప్రధానంగా టెక్ మరియు ఏఐ (AI) కంపెనీలే తమ లక్ష్యమని పేర్కొంది.
డోనాల్డ్ ట్రంప్ స్పందన – హోర్ముజ్ జలసంధి వివాదం
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. హోర్ముజ్ జలసంధిని తెరిపించడానికి సహకరించాలని ఆయన యూరోపియన్ దేశాలను కోరగా, ఇటలీ మరియు స్పెయిన్ వంటి దేశాలు నిరాకరించాయి. తమ భూభాగాలను ఇరాన్‌కు వ్యతిరేకంగా వాడనీయబోమని అవి స్పష్టం చేశాయి.
దీనిపై స్పందించిన ట్రంప్, “మీ ఓడలను మీరే రక్షించుకోవాలి, అమెరికా సహాయం ఆశించకండి” అని ఆయా దేశాలకు తేల్చి చెప్పారు. అయితే, ఇజ్రాయెల్ మరియు అమెరికా ఓడలు తప్ప మిగిలిన అన్ని దేశాల నౌకలను హోర్ముజ్ ద్వారా అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది.
యుద్ధం ముంగిట..
అమెరికా ఏ క్షణమైనా భూతల యుద్ధాన్ని (Ground War) ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించింది. ఇరాన్ ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించగా, విదేశీ సైన్యం తమ దేశంలో అడుగుపెడితే మరణం ఖాయమని ఇరాన్ ప్రతిసవాల్ విసిరింది.
