రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకున్న ఒక దారుణమైన హత్యోదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 23 ఏళ్ల ఆరుషి శర్మ అనే కసాయి కుమార్తె, తన తల్లి నీరజ్ శర్మను చంపడానికి ఏకంగా రూ. 7 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. అత్యంత పవిత్రమైన తల్లి-కూతుళ్ల అనుబంధాన్ని రక్తపు మరకలతో తడిపిన ఆరుషి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈ పాపానికి ఒడిగట్టింది. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటి, అందులో వచ్చే జీతం ఎంత?
తల్లితో పాటు తమ్ముడిని కూడా అంతం చేయాలని ప్లాన్: ఆరుషి కేవలం తన తల్లిని మాత్రమే కాదు, 16 ఏళ్ల తన దివ్యాంగుడైన తమ్ముడిని కూడా సజీవదహనం చేయాలని పథకం వేసింది. తండ్రి మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం, కోట్ల రూపాయల ఆస్తికి తానే ఏకైక వారసురాలిని కావాలనే దురాశతో ఈ దారుణానికి ఒడిగట్టింది.
అసలు ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏమిటి? జైపూర్‌లోని కోర్టులో ఆరుషి తండ్రి ‘లోయర్ డివిజన్ క్లర్క్’ (LDC)గా పనిచేసేవారు. ఏడాది క్రితం తండ్రి చనిపోయినప్పుడు, ఆరుషికి అప్పుడే 12వ తరగతి పూర్తయ్యింది. ఆ ఉద్యోగం ఆరుషికి రావాల్సి ఉండగా, తమ్ముడి సంరక్షణ దృష్ట్యా తల్లి నీరజ్ శర్మ ‘కారుణ్య నియామకం’ (Compassionate Appointment) కింద ఆ ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగాన్ని దక్కించుకుని, ఆస్తిని అనుభవించాలనేది ఆరుషి కుట్ర.
LDCకి ఎంత జీతం వస్తుంది? రాజస్థాన్ హైకోర్టు/సబార్డినేట్ కోర్టుల్లో LDC పోస్ట్ ‘పే మ్యాట్రిక్స్ లెవల్-5’ కిందకు వస్తుంది.
- ప్రొబేషన్ కాలంలో: నెలకు సుమారు ₹13,000 నుండి ₹20,000 వరకు వేతనం అందుతుంది.
- స్థిరపడిన తర్వాత: ఇన్-హ్యాండ్ జీతం ₹33,000 నుండి ₹40,000 వరకు ఉంటుంది.
- కారుణ్య నియామకం ద్వారా తల్లికి వచ్చిన ఉద్యోగం కావడంతో, నెలకు సుమారు ₹20,000 నుండి ₹25,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది.
హత్యకు ముందు జరిగిన ప్రయత్నాలు: కేవలం ₹20 వేల నుండి ₹25 వేల జీతం కోసం ఆరుషి ఎంతటి నీచానికి ఒడిగట్టిందంటే:
- మొదట తన తల్లిని, తమ్ముడిని ఇంట్లోనే సజీవదహనం చేసేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయి.
- అది విఫలమవడంతో, జూన్ నెలలో కారుతో యాక్సిడెంట్ చేయించి చంపేందుకు ప్రయత్నించింది.
- చివరకు, జూలై 4న తన తమ్ముడిని ట్యూషన్ దగ్గర దింపి వస్తున్న తల్లిని, 130 కి.మీ వేగంతో వచ్చిన స్కార్పియో కారుతో ఢీకొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేయించింది.
ఈ హత్య కోసం ఆరుషి భరత్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తికి అడ్వాన్స్‌గా ఏడు లక్షల రూపాయల సుపారీ ఇచ్చింది. ప్రస్తుతం ఆరుషిని పోలీసులు అరెస్టు చేశారు. స్వల్ప జీతం కోసం సొంత తల్లిని బలితీసుకున్న ఈ ఉదంతం జైపూర్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది.
