హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి.. భానుడు భగభగలాడుతున్నాడు. ఇళ్లలో ఏసీలు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. అయితే, ఏసీ వాడే ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య.. కొండంత వచ్చే ‘కరెంటు బిల్లు’. చాలామంది ఏసీ వాడుతున్నా గది సరిగ్గా చల్లబడటం లేదని, బిల్లు మాత్రం భారీగా వస్తోందని గగ్గోలు పెడుతుంటారు. దీనికి గదిలో ఏసీ సెట్టింగ్స్ మాత్రమే కాదు, బయట ఉండే ‘అవుట్‌డోర్ యూనిట్’ (Outdoor Unit) కూడా ఒక కారణమని మీకు తెలుసా? ఆ యూనిట్ ఉండే చోటును బట్టి మీ ఏసీ జీవితకాలం, మీ జేబులోని డబ్బు ఆధారపడి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండలోనా.. నీడలోనా? నిపుణులు ఏమంటున్నారు?
చాలా ఇళ్లలో అవుట్‌డోర్ యూనిట్‌ను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తుంటారు. కానీ అమెరికా ఇంధన శాఖ (U.S. Department of Energy) మరియు ఎలక్ట్రికల్ నిపుణుల ప్రకారం.. అవుట్‌డోర్ యూనిట్‌ను ఎప్పుడూ నీడ (Shade) ఉన్న ప్రదేశంలోనే ఉంచాలి.
- ఎండలో ఉంటే నష్టం: నేరుగా ఎండ తగిలే చోట యూనిట్ ఉంటే, అది గదిని చల్లబరచడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కరెంటు వినియోగం 10 నుంచి 15 శాతం పెరుగుతుంది.
- నీడలో ఉంటే లాభం: యూనిట్ చల్లగా ఉన్నప్పుడు కండెన్సర్ కాయిల్స్ త్వరగా వేడిని బయటకు పంపిస్తాయి. ఫలితంగా కంప్రెసర్‌పై ఒత్తిడి తగ్గి, తక్కువ విద్యుత్ ఖర్చుతోనే గదిని త్వరగా చల్లబరుస్తుంది.
కంప్రెసర్ ఆయుష్షు పెంచుకోండి!
ఏసీలో అత్యంత ఖరీదైన భాగం ‘కంప్రెసర్’. నిరంతరం ఎండలో వేడెక్కడం వల్ల కంప్రెసర్ ‘ఓవర్ హీటింగ్’కు గురై త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.
- నీడలో ఉండే యూనిట్ ఎండలో ఉండే దానికంటే 3 నుంచి 5 ఏళ్లు అదనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఇది మీకు భవిష్యత్తులో అయ్యే భారీ రిపేర్ ఖర్చులను తప్పిస్తుంది.
కేవలం నీడ ఉంటే సరిపోదు.. గాలి కూడా ఉండాలి!
అవుట్‌డోర్ యూనిట్‌ను నీడలో ఉంచడం అంటే.. దానిని కిక్కిరిసిన చోట లేదా గాలి ఆడని గదిలో పెట్టడం కాదు.
- వెంటలేషన్: యూనిట్ చుట్టూ కనీసం 1 నుంచి 2 అడుగుల ఖాళీ ఉండాలి.
- గాలి సరిగ్గా సోకకపోతే, యూనిట్ వదిలిన వేడి గాలినే మళ్ళీ లోపలికి లాక్కుంటుంది. దీనివల్ల కూలింగ్ తగ్గిపోయి, ఏసీ మరింత వేడెక్కుతుంది.
మీ ఇంట్లో నీడ లేకపోతే ఏం చేయాలి?
అపార్ట్‌మెంట్లలో లేదా కొన్ని ఇళ్లలో సహజంగా నీడ దొరకకపోవచ్చు. అటువంటప్పుడు ఈ చిట్కాలు పాటించండి:
- కృత్రిమ నీడ (Artificial Shade): అవుట్‌డోర్ యూనిట్ పైన ఫైబర్ షీట్ లేదా చెక్కతో ఒక చిన్న పైకప్పును ఏర్పాటు చేయండి. అయితే అది యూనిట్ నుంచి కనీసం ఒక అడుగు ఎత్తులో ఉండాలి.
- సరైన దిశ: వాస్తు మరియు సాంకేతిక పరంగా.. ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో యూనిట్ అమర్చడం ఉత్తమం. పడమర వైపు ఉండే యూనిట్లు మధ్యాహ్నం తీక్షణమైన ఎండకు ఎక్కువగా వేడెక్కుతాయి.
- క్లీనింగ్ ముఖ్యం: ఎండతో పాటు ధూళి కూడా ఏసీకి శత్రువే. నెలకోసారి నీటి పైపుతో కండెన్సర్ మెష్‌ను శుభ్రం చేయండి. దుమ్ము లేని కండెన్సర్ కూలింగ్‌ను 30% పెంచుతుంది.
