కర్ణాటక రాజధాని బెంగళూరులో గుండెలని పిండేసే విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఐటీ ఇంజనీర్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోగా, అతని భార్య 17వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.
బెంగళూరులోని థానిసాండ్రలో ఉన్న ‘భారతీయ సిటీ’లోని నికో హోమ్స్ అపార్ట్మెంట్లో ఈ దారుణం జరిగింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాను చంద్రారెడ్డి కుంట (32) తన అపార్ట్మెంట్లోని ఒక గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నారు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భార్య బీబీ షాజియా సిరాజ్, సెక్యూరిటీ గార్డులు మరియు పొరుగువారి సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా.. భాను చంద్రారెడ్డి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
భర్త మరణం తట్టుకోలేక.. భర్త మృతదేహాన్ని చూసిన కొద్దిసేపటికే, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన షాజియా (ఈమె IBMలో పనిచేస్తున్నారు) అదే భవనంలోని 17వ అంతస్తు నుండి కిందకు దూకారు. కొద్ది గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ మరణించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తెలంగాణకు చెందిన వీరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఈ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
కారణం ఏమిటి? ప్రాథమిక విచారణ ప్రకారం వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరికి 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది, అంతకుముందు వీరిద్దరూ లివ్-ఇన్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని సమాచారం. పూర్తి నిజాలు పోలీసుల లోతైన విచారణ తర్వాతే బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు.
