నాసిక్/ముంబై: సాఫ్ట్వేర్ రంగంలో గౌరవప్రదమైన ఉద్యోగాలంటూ నమ్మిన యువతులకు నరకం చూపించారు ఆరుగురు కామాంధులు. మహారాష్ట్రలోని నాసిక్ ఐటీ కారిడార్‌లో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లైంగిక వేధింపులు, అత్యాచారమే కాకుండా.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూ బలవంతపు మత మార్పిడిలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆరుగురు ఐటీ టీమ్ లీడర్లను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
ఎవరా ఆరుగురు మృగాళ్లు?
ఒక ప్రముఖ ఐటీ సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమన్, తౌసిఫ్ అత్తార్ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఇప్పటివరకు ఏకంగా తొమ్మిది ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదయ్యాయి. ఈ ఘటనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
రెండేళ్లపాటు కొనసాగిన నరకం..
పోలీసుల కథనం ప్రకారం.. గత రెండు, మూడు ఏళ్లుగా ఆఫీసు ప్రాంగణంలోనే ఈ ఆగడాలు సాగుతున్నాయి.
- యువతులే లక్ష్యంగా: 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన సైగలు చేయడం, దుస్తులపై కామెంట్ చేయడం వంటి పనులకు పాల్పడ్డారు.
- అత్యాచారం: నిందితుల్లో ఒక వివాహితుడు, ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
- మతపరమైన వేధింపులు: బాధితుల మతాన్ని కించపరచడం, వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడం వీరి నిత్యకృత్యంగా మారిందని తేలింది.
మత మార్పిడి రగడ.. పురుష ఉద్యోగి ఫిర్యాదు!
కేవలం మహిళలే కాదు, ఒక పురుష ఉద్యోగి కూడా ఈ కేటుగాళ్లపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఉన్నతాధికారుల హోదాలో ఉన్న నిందితులు తనపై ఒత్తిడి తెచ్చి.. బలవంతంగా మత మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారని, తన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వేధించారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
ముందస్తు ఫిర్యాదులు బుట్టదాఖలు.. హెచ్ఆర్ హెడ్‌పై కేసు!
ఈ దారుణాలపై బాధితులు ఇదివరకే కంపెనీలోని ‘పోష్’ (POSH) చట్టం కింద హెచ్ఆర్ (HR) విభాగానికి ఫిర్యాదు చేశారు. అయితే, యాజమాన్యం ఆ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా నిందితులకు వత్తాసు పలికింది. దీంతో విధిలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించని సదరు హెచ్ఆర్ హెడ్‌ను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు.
సిట్ (SIT) దర్యాప్తు.. ఇంకా ఎందరు బాధితులు?
ఈ కేసులో లోతైన విచారణ జరిపేందుకు సిట్ రంగంలోకి దిగింది. నిందితులు ఇంకా ఎంతమందిని వేధించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఐటీ కంపెనీలో ఒక సంస్థాగత కుట్ర కోణంలో సాగిన ఈ అరాచకాలు సామాన్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
