ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి రాత్రి వేళ రెండు ఎద్దులు ప్రవేశించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ముఖ్యంగా, అందులో ఒక ఎద్దు నేరుగా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు (అత్యవసర చికిత్స విభాగం) లోపలికే వెళ్లి చక్కర్లు కొట్టిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఈ ఘటన ఆసుపత్రి యాజమాన్యం యొక్క అధ్వాన్నమైన భద్రతా ఏర్పాట్లను బయటపెట్టడమే కాకుండా, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దీనిపై విమర్శలు గుప్పించడానికి కారణమైంది.
ఎప్పటిలాగే ఆసుపత్రిలో సాయంత్రం వేళల్లో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది అందరూ తమ అత్యవసర పనులతో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ రెండు ఎద్దులు ఎటువంటి అడ్డంకి లేకుండా ఆసుపత్రి ప్రాంగణంలోకి స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి.
దారిలో నిలబడి ఉన్న ఏ ఒక్క సెక్యూరిటీ గార్డు గానీ, సిబ్బంది గానీ ఆ జంతువులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే నేరుగా అత్యవసర చికిత్స విభాగం ప్రవేశ ద్వారం వద్దకు వచ్చిన ఆ ఎద్దులలో, ఒకటి ద్వారం వద్ద నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ, మరొక ఎద్దు మాత్రం దేని గురించి పట్టించుకోకుండా ఏకంగా వార్డు లోపలికే నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
వార్డులోకి ప్రవేశించిన ఆ ఎద్దు, రోగుల బెడ్లు మరియు వైద్య పరికరాలను దాటుకుంటూ సంచరించింది. ప్రాణాలతో పోరాడే రోగులకు అత్యవసర చికిత్స అందించే ప్రాంతంలోకి హఠాత్తుగా అంత పెద్ద జంతువు రావడం చూసి రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి, భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అక్కడున్న రోగుల బంధువులు కలిసికట్టుగా తీవ్రంగా శ్రమించి ఆ జంతువులను బయటకు తారమగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా వైద్య పరికరాలు ధ్వంసమయ్యాయా అనే వివరాలు ఇంకా వెలువడలేదు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో, ‘ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి జంతువులు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా రాగలవు?’ అని నెటిజన్లు యాజమాన్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ఘటనను ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ఒక పోస్ట్ చేశారు. ‘ఆరోగ్య శాఖ మంత్రికి బదులుగా మరెవరో హఠాత్తుగా తనిఖీలు చేయడానికి వస్తున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

Leave a Reply