నవరాత్రి ఉత్సవాలు అనగానే రంగురంగుల దుస్తులు, రకరకాల అలంకరణలు, లయబద్ధంగా తిరుగుతూ వేసే ‘గర్బా’ నృత్యమే అందరికీ ఠక్కున గుర్తొస్తుంది.
అయితే, ఈ ఏడాది నవరాత్రి గర్బా పోటీలో ఒక యువకుడు విభిన్నమైన, చూసేవారికి ఒకవైపు భయం, మరోవైపు నవ్వు తెప్పించేలా ‘శవం’ (డెడ్‌బాడీ) గెటప్‌లో వచ్చి డ్యాన్స్ చేసిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఆ వీడియోలో, గర్బా నృత్యం ఉత్సాహంగా సాగుతున్న గ్రౌండ్‌లోకి ఉన్నట్టుండి ఒక అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. అందులోంచి నలుగురు వ్యక్తులు ఒంటి నిండా తెల్లటి బ్యాండేజీ కట్టేసి, శవంలా పడుకున్న ఒక వ్యక్తిని స్ట్రెచర్‌పై మోసుకొచ్చి గ్రౌండ్ మధ్యలో దించుతారు.
అది చూసిన మైదానంలోని జనం నిజంగానే ఏదో ప్రమాదం జరిగిందని భయపడి కేకలు వేస్తూ పరుగులు తీయడం మొదలుపెట్టారు. కానీ, మరుక్షణమే స్ట్రెచర్‌పై పడుకున్న వ్యక్తి హఠాత్తుగా లేచి నిలబడి, గర్బా పాటకు తగినట్లుగా గిరగిరా తిరుగుతూ డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. అది చూసిన అక్కడి జనం కాసేపు దిగ్భ్రాంతికి గురైనా, వెంటనే తేరుకుని గొల్లున నవ్వడం మొదలుపెట్టారు.
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ కోసం అతడు వేసిన ఈ విచిత్రమైన వేషం, పోటీలోని ఇతర పాల్గొనేవారిని భయపెట్టడమే కాకుండా, ఇంటర్నెట్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పటివరకు 35 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో, నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Leave a Reply