అనారోగ్య కారణాలతో ఆఫీసుకు సెలవు పెట్టిన ఓ ఉద్యోగి, తిరిగి పనిలో చేరేందుకు ప్రయత్నించినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
వైద్యుడి నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని, సంస్థ నుంచి సెలవుకు అనుమతి కూడా పొందానని చెబుతున్న ఆ ఉద్యోగి.. అకస్మాత్తుగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ అనుభవాన్ని అతను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
‘ఎక్స్’ (X) ప్లాట్ఫామ్లో తన అనుభవాన్ని పంచుకున్న సదరు ఉద్యోగి.. సుమారు రెండు వారాల క్రితం తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పని నుండి సెలవు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కంపెనీ నిబంధనలను పాటిస్తూ, డాక్టర్ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించానని, తన సెలవు గురించి ముందుగానే సమాచారం అందించానని చెప్పాడు. మొదట కంపెనీ కూడా తన సెలవుకు అనుమతి ఇచ్చిందని తెలిపాడు.
కానీ, కొన్ని రోజుల తర్వాత తన ఆఫీస్ అకౌంట్లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు, అతనికి లాగిన్ కాలేదు. మొదట ఏదైనా సాంకేతిక లోపం అనుకున్న అతను, ఆ తర్వాత సంస్థ తనను ఉద్యోగం నుంచి తొలగించిందని తెలుసుకున్నానని చెప్పాడు. ఆ వారం సోమవారమే తన తొలగింపునకు సంబంధించిన ఈ-మెయిల్ పంపారని, ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడే ఆ విషయం తెలిసిందని తన పోస్ట్‌లో వెల్లడించాడు.
ఈ ఘటనపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించడానికి గల కారణాన్ని కంపెనీని అడగాలని, అలాగే లీవ్ అప్రూవల్, మెడికల్ సర్టిఫికెట్ వంటి ముఖ్యమైన పత్రాలను భద్రపరుచుకోవాలని కొందరు సూచించారు. అంతేకాకుండా, తొలగించే ముందు ఏదైనా హెచ్చరిక (వార్నింగ్) ఇచ్చారా, సంస్థ తన స్వంత నిబంధనలను పాటించిందా లేదా అని విచారించాలని మరికొందరు అన్నారు. అయితే, ఆ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్న సమాచారం ఆధారంగా మాత్రమే ఈ వార్త వెలువడినందున, అతని ఆరోపణలను స్వతంత్రంగా ఎవరూ ధృవీకరించలేదు.

Leave a Reply