ఒక గదిలో సోనమ్, దీపక్ శవాలు… పక్క గదిలో 10 ఏళ్ల బాలుడు టీవీ చూస్తూ… “అమ్మానాన్నలు గొడవపడుతున్నారు” అన్న చిన్నారి!

గురుగ్రామ్‌లోని సెక్టార్ 9 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ ఇంట్లోనే పక్క గదిలో 10 ఏళ్ల చిన్నారి ఏమీ తెలియనట్లు టీవీ చూస్తున్నాడు. “ఇక్కడ ఏం జరిగింది?” అని అడిగితే, “అమ్మానాన్నలు గొడవపడుతున్నారు, నాన్న నన్ను వెళ్లి టీవీ చూడమన్నారు” అని ఆ పసివాడు చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కథ రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన దీపక్, సోనమ్ దంపతులది. ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉపాధి కోసం వారు గురుగ్రామ్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు.

ఒక వ్యక్తి ఎంట్రీతో మారిన జీవితం: వీరిద్దరి మధ్య ఒక వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో గొడవలు మొదలయ్యాయి. ఆ వ్యక్తితో సోనమ్ ప్రేమలో పడింది. ఈ విషయం దీపక్‌కు తెలిసి, ఆమెపై నిఘా ఉంచడం ప్రారంభించాడు. “అల్వార్ వెళ్తున్నాను” అని బయలుదేరి, ఇంటి దగ్గరే ఉంటూ భార్య ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు.

ఏప్రిల్‌లో జరిగిన దారుణం: ఏప్రిల్ నెలలో దీపక్ అల్వార్ నుండి తిరిగి వచ్చాడు. అప్పుడు సోనమ్ ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుండటం చూశాడు. దీపక్ రాగానే ఆమె ఫోన్ కట్ చేసింది. ఎవరితో మాట్లాడుతున్నావని దీపక్ అడగ్గా, సోనమ్ దాచడానికి ప్రయత్నించింది. ఫోన్ కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, కోపంతో దీపక్ తన భార్య సోనమ్ దుపట్టాతో గొంతు నులిమి చంపేశాడు. భార్య మరణం తర్వాత, దీపక్ పక్క గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొడుకుకు ఏం చెప్పాడంటే: అమ్మానాన్నల మధ్య గొడవ, అరుపులు విని కొడుకు అక్కడికి రాగా, దీపక్ “ఏమీ లేదు నాన్నా, నువ్వు వెళ్లి టీవీ చూడు” అని చెప్పి పంపేశాడు. తండ్రి మాట విని ఆ చిన్నారి ఏమీ తెలియక టీవీ చూస్తూ ఉండిపోయాడు.

సోదరి పంపిన బంధువు: సోనమ్ సోదరి సాయంత్రం ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో, తన 14 ఏళ్ల కుమార్తెను వారి ఇంటికి పంపింది. లోపలికి వెళ్లిన ఆ అమ్మాయి పరిస్థితి చూసి షాక్ అయి కేకలు వేసింది. పోలీసులు సోనమ్ కాల్ రికార్డ్స్ పరిశీలించగా, ఒక అపరిచిత నంబర్ నుండి ఆమెకు అనేకసార్లు వీడియో కాల్స్ వచ్చినట్లు గుర్తించారు.


Posted

in

by

Tags: