చెన్నై: రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ మరోసారి కీలక వివరణ ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విజయ్ ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. రెండు చోట్లా విజయం సాధించిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. తన శాసనసభ సభ్యత్వానికి పెరంబూర్‌ను ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు.
దీంతో ఖాళీ అయిన ఆ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికలో టీవీకే (TVK) తరఫున నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేయవచ్చంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై గతంలోనే స్పందించిన లారెన్స్.. “నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించాలి” అని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. రాజకీయాల్లోకి రావడానికి తన తల్లి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినప్పటికీ, ప్రజలు కోరుకుంటేనే వస్తానని ఆయన స్పష్టం చేశారు.
అభిమానుల కోలాహలం.. లారెన్స్ కీలక వ్యాఖ్యలు:
ఈ నేపథ్యంలో, చెన్నై ఉత్తండిలోని లారెన్స్ నివాసానికి ఈరోజు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అక్కడకు చేరుకున్న లారెన్స్‌కు అభిమానులు మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. తన నివాసంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాఘవ లారెన్స్ మీడియాతో మాట్లాడారు.
“మీరు చూపిస్తున్న అభిమానానికి ముందుగా నా ధన్యవాదాలు. నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది త్వరలోనే జరుగుతుంది. నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అని చాలా ఆలోచించాను. గతంలో ఒక వీడియో పోస్ట్ చేసి, నా జీవితంలో నేను చేసిన సామాజిక సేవలను గుర్తు చేస్తూ.. నేను రాజకీయాల్లోకి రావాలా అని మిమ్మల్ని అడిగాను. దానికి అపారమైన స్పందన వచ్చింది. అంత మంది నన్ను రాజకీయాల్లోకి రమ్మని కోరడం చాలా సంతోషాన్నిచ్చింది.
నేను ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే నా అభిమానులందరినీ ఆహ్వానించి, మా అమ్మగారిని వేదికపైకి ఎక్కించి.. ఒక ముఖ్యమైన ప్రకటనను అధికారికంగా ప్రకటిస్తాను. టీవీకే (TVK) కార్యకర్తలు చేతగాని వాళ్లు కాదు, వాళ్లే ఆ పార్టీకి అసలైన అమ్ములపొదిలోని బాణాలు (అంబుకురిగళ్).
విజయ్ ప్రభుత్వంపై ప్రశంసలు:
గడిచిన నెల రోజులుగా ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తోందో నేను గమనిస్తూనే ఉన్నాను. చాలా బాగుంది, సూపర్బ్ గా ఉంది. ఆలయాలు, పాఠశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయడం చాలా మంచి నిర్ణయం. పాఠశాల విద్యాశాఖ మంత్రి పనితీరు కూడా బాగుంది. మనం మార్పును కోరుకున్నాం, ఆ మార్పు జరిగింది. కాబట్టి టీవీకే ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి.
విజయ్‌పై ఉన్న అసూయతోనే ప్రతిపక్షాల వారు విమర్శలు చేస్తున్నారు. నేను టీవీకే (TVK) పార్టీలోకి వెళ్తున్నానా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాకు కొన్ని ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ గారి ఆశీస్సులతోనే నేను అన్ని పనులూ చేస్తున్నాను. రజనీకాంత్ గారు నాకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. కేవలం అన్నా మలై మాత్రమే కాదు, ఎవరైనా సరే పార్టీ పెట్టుకోవచ్చు.
రాజకీయాల్లోకి వచ్చాక నటిస్తానా లేదా?
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటిస్తానా లేదా అనేది అప్పుడే చెప్తాను. నేను రాజకీయ పార్టీల నాయకులందరినీ నా అన్నలాగా, తండ్రిలాగా భావిస్తాను. అందరూ నాకు సొంతవాళ్లే. అయినప్పటికీ నాపై చాలా విమర్శలు వస్తాయి, నన్ను టార్గెట్ చేసి కొడతారు . దాన్ని కూడా ఒక చేత్తో చూసేద్దాం! నాకు ప్రజా మద్దతు ఉంది. మనం నిజాయితీగా ఉంటే మంచి జరుగుతుంది. నేను రాజకీయాల్లోకి గొడవలు పడటానికో, ద్వేషపూరిత రాజకీయాలు చేయడానికో రావడం లేదు, ప్రజలకు మంచి చేయడానికే వస్తున్నాను. నాకు డబ్బుపై, పదవులపై ఆశ లేదు. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఈ ఊరంతా ఏడవాలి.. అదే నేను సంపాదించుకునేది” అని లారెన్స్ భావోద్వేగంగా మాట్లాడారు.

Leave a Reply