ప్రపంచంలో అత్యధికులు పేరు ప్రఖ్యాతులు, సంపద వెంటే పరుగులు తీస్తున్న వేళ.. వీటన్నింటినీ త్యజించి, అంతర్గత ప్రశాంతతను అన్వేషిస్తూ సాగే కొందరి జీవన ప్రయాణాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
ఆ కోవలోనే, స్పెయిన్‌కు చెందిన మాజీ మోటో రేసింగ్ క్రీడాకారుడు యాక్సెల్ పోన్స్ (Axel Pons) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చనీయాంశంగా మారారు.
స్పెయిన్‌లోని బార్సిలోనాలో 1991 ఏప్రిల్ 9న జన్మించిన యాక్సెల్ పోన్స్.. రెండుసార్లు 250cc ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ప్రముఖ రేసర్ సిటో పోన్స్ (Sito Pons) కుమారుడు. చిన్నప్పటి నుంచే రేసింగ్ ట్రాకులు, ట్రోఫీల మధ్య పెరిగిన ఆయన, బార్సిలోనాలోని లాసల్లె యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఇంజనీరింగ్ పట్టా కూడా పొందారు.
2008లో 125cc విభాగంలో అడుగుపెట్టి, 2010 నుంచి మోటో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు. తన పదేళ్ల రేసింగ్ కెరీర్లో మొత్తం 144 గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో పాల్గొని 179 పాయింట్లు సాధించారు. మార్క్ మార్క్వెజ్, ఫ్రాన్సిస్కో బగ్నాయా వంటి ప్రపంచ ప్రసిద్ధ ఛాంపియన్లతో పోటీపడిన ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లకు పైమాటేనని సమాచారం.
అంతటి విజయవంతమైన క్రీడాకారుడిగా కొనసాగుతూనే, 2017లో తన 26వ ఏట ఎవరూ ఊహించని రీతిలో రేసింగ్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు. కొంతకాలం మోడలింగ్ రంగంలో ఉండి, ఆ తర్వాత ఏకాంత జీవనం గడుపుతూ.. అతివేగం, విలాసవంతమైన జీవనశైలిపై తనలో తానే ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెట్టారు.
“నేను నా జీవిత వేగాన్ని పూర్తిగా తగ్గించుకున్నాను. ఇప్పుడు చాలా నెమ్మదిగా నడుస్తూ, జీవితంలోని చిన్న చిన్న విషయాలను అనుభూతి చెందుతున్నాను” అని ఆయన గతంలో పేర్కొన్నారు. 2023లో తన స్వదేశమైన స్పెయిన్‌ను వదిలి.. కాళ్లకు చెప్పులు లేకుండా, వీపున ఒక సాధారణ బ్యాగు తగిలించుకుని ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా, హోటళ్లలో బస చేయకుండా గత 15 నెలల్లో ఏకంగా 10 దేశాల సరిహద్దులను దాటారు.
వాస్తవానికి ఆయన భారతదేశానికి నడిచి రావాలని అనుకున్నారు; అయితే వీసా సమస్యల కారణంగా ఆయన ప్రయాణం పాకిస్తాన్ వైపు మళ్లింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, చిత్రాల్ లోయల్లో ఆయన నిరాడంబరంగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు, తనను తాను ‘ఈసా’ అని పిలుచుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ అయి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడి ప్రజల ఆత్మీయత, సాదాసీదా జీవన విధానం ఆయనను ఎంతగానో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఆయన అక్కడే తాత్కాలికంగా బస చేస్తున్నారు.

Leave a Reply