దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు కూపర్ కాన్నోలి పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ది వాండరర్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
28వ ఓవర్‌లో ఆడమ్ జంపా వేసిన బంతిని మార్క్రమ్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అతను అనుకున్నంత ఎత్తుకు వెళ్లకుండా.. షార్ట్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కూపర్ కాన్నోలి వైపు దూసుకెళ్లింది.
బంతి తనకు దూరంగా వెళ్తుండటాన్ని గమనించిన కాన్నోలి వెంటనే ఎడమవైపు వేగంగా పరిగెత్తాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గాల్లోకి దూకి.. ఒకే చేత్తో బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.
కాన్నోలి పట్టిన ఈ క్యాచ్ చూసి మైదానంలోని అభిమానులు ఒక్కసారిగా కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. 48 పరుగులతో మంచి టచ్‌లో ఉన్న మార్క్రమ్.. ఈ క్యాచ్ కారణంగా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
మ్యాచ్ కీలక దశలో లభించిన ఈ వికెట్ ఆస్ట్రేలియా జట్టులో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మార్క్రమ్ ఔటయ్యే సమయానికి దక్షిణాఫ్రికా 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.
కాగా, 23 ఏళ్ల కూపర్ కాన్నోలి ఎడమచేతి వాటం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా.. ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ బౌలర్‌గా కూడా ఆస్ట్రేలియా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Leave a Reply