ఒక్క డాట్ బాల్ కూడా లేకుండా రికార్డు పరుగులు.. అభిషేక్ శర్మ విధ్వంసానికి కారణమైన ఆ ‘కొత్త టెక్నిక్’ ఏంటి?

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, తొలి బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ ఏ దశలోనూ తగ్గలేదు. న్యూజిలాండ్ కంటే రెట్టింపు వేగంతో ఆడి కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఇది భారత్‌కు వరుసగా 11వ టీ20 సిరీస్ విజయం. తద్వారా పాకిస్థాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.

అభిషేక్ శర్మ రికార్డుల వర్షం: భారత్ ఈ చారిత్రాత్మక ఛేజింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. కేవలం 20 బంతుల్లోనే 340 స్ట్రైక్ రేట్‌తో 68 పరుగులు చేశాడు.

  • వేగవంతమైన హాఫ్ సెంచరీ: 14 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, టీ20ల్లో భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
  • స్ట్రైక్ రేట్ రికార్డ్: అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు పదిసార్లు 50+ స్కోర్లు చేసిన అభిషేక్, అందులో 9 సార్లు 25 కంటే తక్కువ బంతుల్లోనే ఆ మైలురాయిని చేరుకోవడం విశేషం.

తొలి బంతికే సిక్సర్: రెండో ఓవర్ వేసిన జాకబ్ డఫ్ఫీ బౌలింగ్‌లో మొదటి బంతికే క్రీజు వెలుపలికి వచ్చి మిడ్ వికెట్ మీదుగా 88 మీటర్ల సిక్సర్ కొట్టాడు. గత మ్యాచ్‌లో అదే డఫ్ఫీ బౌలింగ్‌లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. కానీ ఈసారి ఏమాత్రం తడబడకుండా ఎదురుదాడికి దిగాడు.

అభిషేక్ వాడిన ‘కొత్త టెక్నిక్’: అభిషేక్ ఆటలో ఇప్పుడు ప్రధానంగా ‘Making Room’ అనే టెక్నిక్ కనిపిస్తోంది. బంతిని బాదడానికి తనకు కావలసిన ఖాళీ ప్రదేశాన్ని (Space) సృష్టించుకోవడానికి లెగ్ సైడ్ వైపు జరిగి, ఆ తర్వాత బ్యాట్‌ను వేగంగా తిప్పుతున్నాడు.

  • మిడిల్ స్టంప్ లైన్‌లో వచ్చే బంతులను కూడా ఆఫ్ సైడ్ (కవర్స్, పాయింట్) దిశగా బౌండరీలు కొడుతున్నాడు.
  • కైల్ జేమీసన్ వేసిన ఓవర్‌లో యార్కర్ లెంగ్త్ బంతులను కూడా లెగ్ సైడ్ జరిగి ఫుల్ టాస్‌లుగా మార్చుకుని సిక్సర్లుగా మలిచాడు.
  • ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభిషేక్ ఆట తీరును ప్రశంసిస్తూ, “గతంలో అభిషేక్ షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బంది పడతాడని విశ్లేషణలు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ బంతులను కూడా అతను అద్భుతంగా బౌండరీలకు తరలిస్తున్నాడు” అని పేర్కొన్నారు.

ఒక్క డాట్ బాల్ కూడా లేదు (No Dot Balls): అభిషేక్ ఆడిన 20 బంతుల్లో ఒక్కటి కూడా డాట్ బాల్ లేదు. అంటే ప్రతి బంతికి అతను పరుగులు తీశాడు (7 ఫోర్లు, 5 సిక్సర్లు, 6 సింగిల్స్, 2 డబుల్స్). టీ20 చరిత్రలోనే ఒక్క డాట్ బాల్ కూడా ఆడకుండా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ (68 పరుగులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కెనడాకు చెందిన హర్ష్ థాకర్ (53* పరుగులు) పేరిట ఉండేది.


Posted

in

by

Tags: