ప్రముఖ జానపద గాయని, బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ సుమారు రూ.13 కోట్ల విలువైన లగ్జరీ ‘రోల్స్ రాయిస్’ కారులో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట విడుదలై తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో అతి తక్కువ ఆస్తులు ఉన్నట్లు చూపించి, ఇప్పుడు ఇంత ఖరీదైన కారులో తిరుగుతుండటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
బీహార్‌లోని అలీనగర్ నియోజకవర్గానికి చెందిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన వద్ద కేవలం ఒక హోండా యాక్టివా స్కూటర్ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఆమె కోట్ల విలువైన లగ్జరీ కారులో తిరగడం చూసిన జనాలు.. ‘సడెన్‌గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?’ అని ప్రశ్నిస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే, మైథిలీ ఠాకూర్ ప్రయాణించిన ఆ రోల్స్ రాయిస్ కారు నిజంగా ఆమె సొంత కారా లేక వేరే ఎవరిదైనా అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ నేపథ్యంలో, ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాతే ఈ కారును కొనుగోలు చేసిందనే ప్రచారం కూడా ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపిస్తోంది.
మైథిలీ ఠాకూర్ పట్ల వ్యక్తమవుతున్న ఈ విపరీతమైన ద్వేషాన్ని, విమర్శలను చూసి మండిపడిన బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెంటనే ఆమెకు మద్దతుగా గొంతు విప్పారు. సోషల్ మీడియా ట్రోలర్స్‌కు తనదైన శైలిలో చురకలు అంటిస్తూ కౌంటర్ ఇచ్చిన కంగనా.. మైథిలీకి తన పూర్తి మద్దతును ప్రకటించారు.
‘మేము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినా, మాకంటూ సొంత వృత్తి, జీవితం, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి’ అని పేర్కొన్న కంగనా.. ‘మేము ప్రజల డబ్బును ఆశించడం లేదు; కానీ రాజకీయ నాయకులు ఎప్పుడూ పేదవారిగానే బతకాలనుకోవడం ఎంతవరకు న్యాయం? మేము కూడా మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని గడపకూడదా?’ అని ప్రశ్నిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటుగా పోస్ట్ చేశారు.

Leave a Reply