సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో, ఒక భారతీయ కంపెనీ ఉద్యోగులను వారి మతపరమైన గుర్తింపు కారణంగా బహిరంగంగా అవమానించిన ఘటన ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
ఏం జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక సౌదీ వ్యక్తి భారతీయ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ వద్దకు వెళ్లి, “ఈ కంపెనీలో ఒక్క ముస్లిం ఉద్యోగి కూడా లేడా? ఇక్కడికి ఒక హిందూ సంస్థను పంపడం సిగ్గుచేటు” అంటూ అత్యంత అసభ్యంగా మాట్లాడారు.
వృత్తిపరమైన ప్రదర్శనలో మతపరమైన వివక్షను ప్రేరేపించేలా అతను మాట్లాడటం అక్కడ ఉన్న వారితో పాటు నెటిజన్లను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.
అంతర్జాతీయ స్థాయిలో ఖండన
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అమ్జద్ తాహా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. తన ఎక్స్ (X) ఖాతాలో స్పందిస్తూ.. “వ్యాపారం అనేది మసీదుకు వ్యక్తులను ఎంపిక చేసే స్థలం కాదు. ఆధునిక సమాజంలో ఇటువంటి మత రక్షకులకు చోటు లేదు” అని పేర్కొన్నారు.
“ఇది స్పష్టమైన జాత్యహంకారం. రియాద్ ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటు చేసిన భారతీయులను హిందువులనే కారణంతో సౌదీ వ్యక్తి దాడి చేయడం, ‘ఈ హిందూ కంపెనీలో ఒక్క ముస్లిం కూడా లేడు’ అని ఎగతాళి చేయడం అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది మర్యాదకు, విశ్వాసానికి మరియు స్వేచ్ఛా వాణిజ్యానికి వ్యతిరేకంగా జరిగిన దాడి” అని ఆయన ఘాటుగా స్పందించారు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాజిక కార్యకర్తలు
భారతీయుల కష్టాన్ని, వారి భిన్నత్వాన్ని కించపరిచేలా జరిగిన ఈ జాత్యహంకార దాడిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఖండిస్తున్నారు. సౌదీ అరేబియాలో ఇటువంటి మతపరమైన గొడవలు అంతర్జాతీయ వ్యాపార సంబంధాలపై ప్రభావం చూపుతాయని, ఇటువంటి నాగరికత లేని చర్యలను కఠినంగా అరికట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
