మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా జైత్‌హరి మున్సిపాలిటీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
ఆ వీడియోలో.. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఒక చిన్నారి అక్కడున్న ఉద్యోగిని మిఠాయి (స్వీట్) అడిగినట్లు కనిపించింది. అంతే.. ఆ మాత్రానికే కోపోద్రిక్తుడైన ఆ మున్సిపల్ ఉద్యోగి, కనికరం లేకుండా ఆ పసివాడి జుట్టు పట్టుకుని పైకి లేపి, విచక్షణారహితంగా దాడి చేశాడు.
కేవలం చిన్నపిల్లల మనస్తత్వంతో స్వీట్ అడిగినందుకు ఆ ముక్కుపచ్చలారని బాలుడిపై రాక్షసుడిలా విరుచుకుపడటం చూసి నెటిజన్లు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఉద్యోగి చేష్టలతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ చిన్నారి రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు, పిల్లలతో బాధ్యతాయుతంగా, మర్యాదగా మెలగాల్సిన ఉద్యోగి ఇంతటి కర్కశత్వానికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, అధికారులు వెంటనే స్పందించి ఆ క్రూర ఉద్యోగిపై కఠిన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
