న్యూ ఢిల్లీ: లక్నో యూనివర్సిటీలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తనను వచ్చి కలవాలంటూ, అందుకు ప్రతిఫలంగా పరీక్షా పత్రాలను లీక్ చేసి ఇస్తానని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినికి ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఒక అసభ్యకర ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
యూనివర్సిటీలోని జువాలజీ (Zoology) విభాగానికి చెందిన డాక్టర్ పరమ్‌జీత్ సింగ్‌గా నిందితుడిని గుర్తించారు. ఈ ఆడియో రికార్డింగ్ క్యాంపస్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ప్రస్తుతం పోలీసులు ఆ ప్రొఫెసర్‌ను విచారిస్తున్నారు.
ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఆ ఆడియో క్లిప్‌లో, విద్యార్థిని నిరాకరిస్తున్నప్పటికీ, ప్రొఫెసర్ ఆమెను పదేపదే వచ్చి కలవాలని బలవంతం చేయడం వినబడుతోంది. అందులో ఆయన.. “డార్లింగ్, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అడుగు, నీ కోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి” అని అనడం వినిపించింది.
ఆ క్లిప్‌లోని మరో భాగంలో నిందితుడు విద్యార్థినితో.. “నీ కోసం నేను రెండు క్వశ్చన్ పేపర్లు అవుట్ (లీక్) చేశాను, నువ్వు ఒకసారి వచ్చి నన్ను కలువు” అని చెప్పాడు. ఫోన్ కాల్ ముగిసిన తర్వాత, ఆ విద్యార్థిని మాట్లాడుతూ.. ప్రొఫెసర్ తనను ఆఫీస్‌కు రప్పించి, మళ్లీ తనపై “లైంగిక వేధింపులకు” (Molest) పాల్పడాలనే ఉద్దేశంతోనే బలవంతంగా క్వశ్చన్ పేపర్లు ఇస్తానని ఆశ చూపుతున్నాడని ఆరోపించింది.
నిందితుడైన ప్రొఫెసర్ అరెస్ట్
ఈ వివాదం చెలరేగడంతో యూనివర్సిటీ యంత్రాంగం పోలీసులకు సమాచారం అందించి, అంతర్గత విచారణను ప్రారంభించింది. అంతేకాకుండా, ఎగ్జామినేషన్ కంట్రోలర్ (పరీక్షల నియంత్రణాధికారి) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, విచారణ నిమిత్తం ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొఫెసర్ చేసిన అసభ్యకర ప్రవర్తన మరియు యూనివర్సిటీ పరీక్షా పత్రాలను లీక్ చేశామన్న ఆరోపణలు.. ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. అయితే, నిందితుడైన ప్రొఫెసర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారని, ఈ వివాదం వెనుక “యూనివర్సిటీ అంతర్గత రాజకీయాలు” ఉన్నాయని క్లెయిమ్ చేసినట్లు సమాచారం.
ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో నిరసనలు
ఆడియో క్లిప్ బయటకు వచ్చిన వెంటనే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్తలు క్యాంపస్ లోపల భారీ నిరసనలు చేపట్టారు, నిందితుడైన ప్రొఫెసర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
