దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073 లో, నడి ఆకాశంలో కాక్‌పిట్‌లో జరిగిన దాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్, 29 ఏళ్ల ఒమన్ దేశానికి చెందిన హమామ్ అల్-హమ్మామీ అని ప్రస్తుతం అధికారికంగా తెలిసింది.
అమెరికన్ మీడియా సంస్థలైన ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘సీఎన్ఎన్’ ప్రచురించిన కథనాల ప్రకారం.. హమామ్ అల్-హమ్మామీకి ఉగ్రవాద భావజాలం పట్ల ఆకర్షితుడయ్యాడనే అనుమానంతో ఒమన్ జాతీయ విమానయాన సంస్థ శిక్షణా విభాగం నుంచి అతడిని తొలగించినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఒమన్ పౌర విమానయాన శాఖ అతడు విమానాలు నడపకుండా నిషేధం కూడా విధించింది.
ఒమన్ తండ్రి, సిరియన్ తల్లికి జన్మించిన ఇతడు.. చాలా ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్నాడు. ఒమన్ ప్రభుత్వంచే నిషేధించబడిన ఒక వ్యక్తి, అన్ని భద్రతా తనిఖీలను దాటుకుని ఫ్లైదుబాయ్ సంస్థలో ఉద్యోగంలో ఎలా చేరాడు? అదీ ఇజ్రాయెల్ వెళ్లే కీలకమైన విమానానికి పైలట్‌గా ఎలా నియమించబడ్డాడు? అనే దానిపై భద్రతా సంస్థలు తీవ్ర దర్యాప్తు జరుపుతున్నాయి.
విమానం నడి ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో, కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేశాడు. దీంతో విమానం అదుపు తప్పి, అత్యంత వేగంగా కిందికి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడినప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోని కెప్టెన్ స్మిత్ మచ్చార్, కాక్‌పిట్ తలుపును తెరిపించాడు. వెంటనే లోపలికి ప్రవేశించిన ప్రయాణికులు, ఇతర సిబ్బంది ఆ కో-పైలట్‌ను పట్టుకుని బంధించారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
సౌదీలో అరెస్టయిన హమామ్ అల్-హమ్మామీని, ప్రస్తుతం తదుపరి విచారణ నిమిత్తం యూఏఈకి తీసుకువెళ్లారు. అతడి వద్ద జరిపిన తనిఖీల్లో ‘పాలస్తీనా విముక్తి’ కరపత్రాలు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకమైన ప్రచురణలు స్వాధీనం చేసుకున్నారు. ఒమన్ దేశంతో ఇజ్రాయెల్‌కు దౌత్య సంబంధాలు లేని నేపథ్యంలో, ఒక ఒమన్ పైలట్ ఇజ్రాయెల్ వెళ్లే విమానంలో ఎందుకు విధులు నిర్వర్తించాడు? దీని వెనుక ఏదైనా ఉగ్రవాద కుట్ర ఉందా? అన్న కోణంలో ఇజ్రాయెల్, యూఏఈ నిఘా వర్గాలు తీవ్ర విచారణ చేపట్టాయి.

Leave a Reply