కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక పోలీసు అధికారిని వెనక్కి వెళ్లమని చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో షా వేదికపై నుండి మాట్లాడుతూ.. “ఓ.. బెంగాల్ పోలీస్, జరా వాపస్ జావో!” (ఓయ్ బెంగాల్ పోలీస్, కొంచెం వెనక్కి వెళ్లండి!) అని అనడం వినిపిస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతున్న తరుణంలో అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలకు సభికుల నుండి పెద్ద ఎత్తున కేకలు, ఈలలు వినిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వేగంగా వ్యాపించింది.
మహువా మోయిత్రా స్పందన: అమిత్ షా వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వెంటనే స్పందించారు. ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆమె షాకు కౌంటర్ ఇస్తూ.. మీరు దేశ రాజధానికి తిరిగి వెళ్లాలని ఎద్దేవా చేశారు. “అరె ఓ మోతాభాయ్.. విను.. జరా ఢిల్లీకి వాపస్ వెళ్లు!” అంటూ ఆమె హిందీలో ఘాటుగా సమాధానమిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో భారీగా ఓటింగ్ నమోదైన తర్వాత కోల్‌కతాలో అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓటింగ్ శాతం పెరగడం అనేది బీజేపీకి పెరుగుతున్న మద్దతుకు సంకేతమని, బెంగాల్‌లో త్వరలోనే ప్రభుత్వం మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో షా మాట్లాడుతూ.. ఏప్రిల్ 29న ఓటర్లకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, మే 5వ తేదీ తర్వాత సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ పోలింగ్‌లో ఏకంగా 91.78 శాతం ఓటింగ్ నమోదైంది.
