ఓ మహిళకు ఇంత పగ, కక్షా? భర్తను చంపి ఇంట్లోనే తగలబెట్టి.. శరీర భాగాలను ఇసుకలో పాతిపెట్టిన భార్య.. 17 రోజుల తర్వాత బయటపడిన భయంకర రహస్యం.. తండ్రి కోసం కొడుకు వెతకడంతో వెలుగులోకి వచ్చిన నిజం!

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో మానవ సంబంధాలను మంటగలిపే ఓ ఘోర ఘటన చోటుచేసుకుంది. థాంబీ అంబా గ్రామంలో తన భర్తను కొట్టి చంపి, ఆధారాలు లేకుండా చేసేందుకు ఇంటి వెనుక గదిలో మృతదేహాన్ని తగలబెట్టి, మిగిలిన శరీర భాగాలను ఇసుక కుప్పలో దాచిపెట్టిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు.

సుమారు 17 రోజుల పాటు ఈ భయంకరమైన రహస్యం ఆ ఇంటి నాలుగు గోడల మధ్యే సమాధి అయిపోయింది.

గుజరాత్‌లో కూలీ పని చేసుకునే పెద్ద కొడుకు రాహుల్ గ్రామానికి తిరిగి వచ్చినప్పుడే ఈ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. తన 50 ఏళ్ల తండ్రి రామా గత కొన్ని రోజులుగా గ్రామంలో కనిపించడం లేదని స్థానికులు రాహుల్‌కు చెప్పారు.

తండ్రి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో, తన 47 ఏళ్ల తల్లి నహ్సుబాయిపై రాహుల్‌కు అనుమానం కలిగింది. వెంటనే ఇంటికి వెళ్లి తల్లిని నిలదీయగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం మరింత బలపడిన కొడుకు ఇల్లంతా తనిఖీ చేయగా, వెనుక గదిలో ఉన్న ఇసుక కుప్ప కింద సగం కాలిన మానవ శరీర భాగాలు కనిపించాయి. అది చూసి షాక్‌కు గురైన రాహుల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

భర్తను చంపిన తర్వాత ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా ఉండేందుకు, మండుతున్న శవంపై ఆమె ఓ ఇనుప డ్రమ్మును బోర్లించి ఉంచింది. అయితే శవం పూర్తిగా కాలకపోవడంతో.. సగం కాలిన తల, చేతులు, కాళ్లు, ఇతర భాగాలను ఇసుకలో పాతిపెట్టింది. అంతేకాకుండా, భర్త ఆనవాళ్లు పూర్తిగా లేకుండా చేసేందుకు అతడి ఐడీ కార్డులు, ఇతర ప్రభుత్వ పత్రాలు, ఫోటోలను కూడా మంటల్లో వేసి తగలబెట్టింది.

మృతుడు రామా తన భార్య ప్రవర్తనపై తరచూ అనుమానం వ్యక్తం చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై వారిద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజు కూడా ఇదే విషయమై గొడవ తారాస్థాయికి చేరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన భార్య కర్రతో కొట్టి భర్తను దారుణంగా హత్య చేసింది.

కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గదిలో నుంచి మృతదేహ అవశేషాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఇండోర్‌కు పంపించారు. నిందితురాలైన భార్య నహ్సుబాయిపై హత్య, ఆధారాలు తారుమారు చేసిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *