వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఒక తాత్కాలిక రక్షణ ఒప్పందం ఖరారైంది. ఇది తనకు దక్కిన చారిత్రాత్మక విజయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకుంటున్నప్పటికీ.. ఈ ఒప్పందంలోని మెజారిటీ నిబంధనలు ఇరాన్‌కే లాభదాయకంగా ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇరాన్ పట్టుదల ముందు ట్రంప్ పూర్తిగా మోకరిల్లారని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం గత కొన్ని నెలలుగా నిరంతరాయంగా సాగుతోంది. ఈ యుద్ధాన్ని ముగించడానికి పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇరాన్‌తో ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇది అమెరికాకు లభించిన ఒక పెద్ద విజయమని ఆయన అభివర్ణించినప్పటికీ.. మార్కెట్ నిపుణులు ఎవరూ దీన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. దేశానికి భారంగా మారిన ఒక సుదీర్ఘ యుద్ధం నుండి బయటపడటానికి అమెరికా వెతుక్కున్న ఒక మార్గంగానే దీన్ని చూస్తున్నారు.
- యుద్ధ ఖర్చులు
ఈ ఇరు దేశాల ఘర్షణ ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఇరాన్ యొక్క అణుశక్తి సామర్థ్యాలను దెబ్బతీయడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన సంయుక్త దాడులే ఈ యుద్ధానికి మూలకారణం. మొదట్లో ఈ దాడులు చాలా త్వరగా ముగిసిపోతాయని అంతా భావించారు. స్వయంగా ట్రంప్ కూడా ఈ యుద్ధం కేవలం నాలుగైదు వారాల్లో ముగుస్తుందని నొక్కి చెప్పారు. కానీ, పలు అంతర్జాతీయ కారణాల వల్ల యుద్ధం ముగియకుండా సాగుతూనే వచ్చింది. 100 రోజులు దాటిన ఈ యుద్ధం కారణంగా అమెరికాకు దాదాపు 25 నుండి 29 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష సైనిక ఖర్చు (డైరెక్ట్ మిలిటరీ కాస్ట్) వాటిల్లింది.
ఇది కేవలం ప్రత్యక్ష ఖర్చు మాత్రమే. ఇది కాకుండా పరోక్షంగా అమెరికా మరికొన్ని బిలియన్ డాలర్లు నష్టపోయి ఉంటుందని అంచనా. అంతేకాకుండా, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (హార్ముజ్ జలసంధి) ద్వారా ఓడల రవాణా నిలిచిపోవడంతో ప్రపంచ ఇంధన మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
- ఒప్పందంలోని ముఖ్యాంశాలు
ట్రంప్ దీన్ని విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ.. ఒప్పందంలోని పాయింట్లు చాలా వరకు ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఇరాన్ చమురు (ఆయిల్) ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా తొలగించారు. దీనితో పాటు, ఇరాన్ పునర్నిర్మాణం మరియు పెట్టుబడుల కోసం సుమారు 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 25 లక్షల కోట్లకు పైగా) భారీ ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నాయి. దీనిని ఇరాన్ ‘యుద్ధ నష్టపరిహారం’ అని పిలుస్తుండగా.. అమెరికా మాత్రం ‘అంతర్జాతీయ పెట్టుబడి’గా కలరింగ్ ఇస్తోంది. పేరు ఏదైనా.. అమెరికా ఇరాన్‌కు దాదాపు 300 బిలియన్ డాలర్లు ఇస్తోందనేది మాత్రం పచ్చి నిజం!
ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినప్పటికీ.. అసలైన అణుశక్తి వివాదాలు (Nuclear Issues) ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. వాటిని 60 రోజుల గడువు గల తదుపరి చర్చలకు నెట్టేశారు. అంటే, ప్రధాన సమస్యలపై చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా చాలా విషయాలలో ఇరాన్‌కు లొంగిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- అమెరికా బలహీనత
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఒక అమెరికన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన.. “హార్ముజ్ జలసంధిని అమెరికా పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది” అని పేర్కొన్నారు. అయితే, ప్రసిద్ధ జర్నలిస్ట్ మార్గరెట్ బ్రెన్నాన్ స్పందిస్తూ.. “అమెరికాకు అక్కడ పూర్తి నియంత్రణే ఉంటే.. చర్చల ద్వారా ఆ రవాణా మార్గాన్ని తెరిపించడానికి అంతగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది?” అని గట్టిగా ప్రశ్నించారు. దీనికి రక్షణ మంత్రి ఇచ్చిన అస్పష్టమైన సమాధానం.. అమెరికా యొక్క బలహీనతను స్పష్టంగా సూచిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. - అంతర్గత రాజకీయ ఒత్తిడి
అమెరికాలో రాబోయే నవంబర్ నెలలో మిడ్-టర్మ్ (మధ్యంతర) ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి సమయంలో అంతర్జాతీయ సంక్షోభం కారణంగా అమెరికాలో కూడా ఇంధన (ఫ్యూయల్) ధరలు ఆకాశాన్నంటాయి. ఇది ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాకుండా, రాబోయే జూలై 4 నాటికి అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోబోతోంది. ఇలాంటి వేడుకల సమయంలో ముగింపు లేని ఒక యుద్ధాన్ని కొనసాగించడం ట్రంప్‌కు రాజకీయంగా భారీ నష్టాన్ని చేకూరుస్తుంది. అందుకే, ఆయన ఈ శాంతి ఒప్పందం కోసం అంతగా ఆతురత చూపినట్లు తెలుస్తోంది. - అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం
ఈ శాంతి ఒప్పందాన్ని చాలా మంది నిపుణులు అత్యంత తొందరపాటు చర్యగా విమర్శిస్తున్నారు. షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ ఏ పేప్ దీనిని “అమెరికా ఎదుర్కొన్న ఒక ఘోరమైన పరాజయం”గా అభివర్ణించారు. కేవలం అమెరికాలోనే కాకుండా, ఇటు ఇజ్రాయెల్‌లోనూ ఈ ఒప్పందంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఇజ్రాయెల్‌కు మరియు ప్రధాని నెతన్యాహుకు ఎదురైన పెద్ద ఓటమిగా ఇజ్రాయెల్ జర్నలిస్ట్ గిడియాన్ లెవీ పేర్కొన్నారు.
ట్రంప్ ప్రభుత్వం దీనిని తమకు దక్కిన అద్భుత విజయంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. ప్రపంచ దేశాలు మాత్రం దీన్ని వేరే కోణంలో చూస్తున్నాయి. ఒక అగ్రరాజ్యం, ఇరాన్ లాంటి చిన్న దేశం యొక్క పట్టుదల ముందు లొంగిపోయి చర్చల నెపంతో యుద్ధం నుండి వెనక్కి తగ్గిందని అంతా భావిస్తున్నారు.

Leave a Reply