అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కేరళకు చెందిన ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురైన ఉదంతం తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
ఈ జంట హత్యల ఘటనకు సంబంధించి, వారి స్నేహితురాలు అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన వారిని త్రిసూర్ వాసి అంజనా హరి (35), తిరువనంతపురం వాసి మేరీ మాథ్యూ (35)గా గుర్తించారు. వీరి ముగ్గురూ అమెరికాలో నివసిస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
అనిలా బేబీ, అంజనా హరి కాలిఫోర్నియాలోని ఓ అపార్ట్మెంట్లో పక్కపక్క ఇళ్లలో నివసిస్తుండగా.. మేరీ మాథ్యూ శాన్ జోస్ నగరంలో ఉండేవారు. గత ఆగస్టు 26న ముగ్గురూ కలిసి ఉత్సాహంగా ఓణం పండుగను జరుపుకున్నారు. అయితే, ఆగస్టు 28న మేరీ మాథ్యూ నివాసానికి వెళ్లిన అనిలా, ఆమెపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన మేరీ మాథ్యూ ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు.
ఆ వెంటనే మిల్పిటాస్ నగరంలోని తన అపార్ట్మెంట్కు చేరుకున్న అనిలా.. అంజనా హరికి ఫోన్ చేసి పార్కింగ్ ప్రాంతానికి రావాలని కోరినట్లు పోలీసులు తెలిపారు. అంజనా అక్కడికి చేరుకోగానే, అనిలా కారును అతివేగంగా నడిపి ఆమెను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అంజనా కూడా అక్కడికక్కడే మరణించారు. ఒకే రోజు స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ వరుస దారుణాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మిల్పిటాస్ నగరానికి సుమారు 1.6 కిలోమీటర్ల దూరంలోని ఓ ఫార్మసీ సమీపంలో నిందితురాలు అనిలా బేబీని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాలే ఈ ఘాతుకానికి దారితీసి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అయితే హత్యలకు గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనపై అమెరికన్ పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
