బీడ్: సమాజం తలవంచుకునే దారుణం మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తాలూకాలో వెలుగుచూసింది. రక్షణగా ఉండాల్సిన రక్తసంబంధమే కాటు వేసింది. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఒక మైనర్ బాలికపై పశువులా పడి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘోర అవమానాన్ని భరించలేక ఆ చిన్నారి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించి, చివరకు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ ఘటనతో బీడ్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అసలేం జరిగింది?
కేజ్ తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం పశువుల పాక నుంచి పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో సమీప బంధువు (బాబాయ్ వరుస) ఆమెపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న బాలికను అడ్డగించి, బలవంతంగా లోపలికి లాక్కెళ్లి అమానుషంగా అత్యాచారం చేశాడు.
అవమానం భరించలేక..
జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక, ఆ వేదనను తట్టుకోలేక ఆ బాలిక ఇంటికి వెళ్లగానే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై ప్రభుత్వ ‘ఘాటి’ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి, శుక్రవారం (ఏప్రిల్ 10) చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.
పోలీసుల యాక్షన్..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కేజ్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి మృతిని సబ్ ఇన్స్పెక్టర్ ఉమేష్ నికమ్ ధృవీకరించారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద మరియు హత్యా నేరం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు..
వావి వరుసలు మరిచి ప్రవర్తించిన ఆ కామాంధుడికి ఉరిశిక్ష వేయాలంటూ బీడ్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పసిబిడ్డ ప్రాణాలు బలిగొన్న ఆ నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
