బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ శరీర బరువుపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, ఆమెను ఎగతాళి చేస్తూ మాట్లాడిన పాకిస్థాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆర్జే (RJ) ఎజాజ్ వారిస్ తాజాగా క్షమాపణలు చెప్పాడు.
సెప్టెంబర్ 19న ప్రసారమైన ‘బిగ్ బాస్ 20’ ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్లో, సినీ తారలను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేసే వారిపై నటుడు సల్మాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఆ సమయంలో కత్రినా కైఫ్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే సల్మాన్ ఖాన్ ఆమెకు మద్దతుగా మాట్లాడాడు. గర్భం దాల్చిన తర్వాత బరువు పెరగడం సహజమేనని, ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్న ఆమె, మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పుడు వ్యాయామం ద్వారా తన పాత ఆకృతిని తిరిగి పొందుతుందని సల్మాన్ పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో, కత్రినాపై గతంలో సెటైర్లు వేసిన ఎజాజ్ వారిస్, తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను విడుదల చేస్తూ క్షమాపణలు కోరాడు. ఆ వీడియోలో, సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్’లో మాట్లాడిన దృశ్యాలను తాను చూశానని తెలిపాడు. అది చూసిన తర్వాత, కత్రినా కైఫ్ గురించి తాను అలా మాట్లాడి ఉండకూడదని అనిపించిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఇద్దరూ తనకు ఎంతో ఇష్టమైనవారని, మాట్లాడుతున్న ఫ్లోలో ఏ సందర్భంలో ఆ మాటలు అన్నానో తనకు తెలియలేదని వివరణ ఇచ్చుకున్నాడు. తన మాటల వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించానని, అందుకు చింతిస్తున్నానని తెలిపాడు.
కత్రినా కైఫ్‌ను శారీరక ఆకృతి ఆధారంగా విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదని ఎజాజ్ వారిస్ స్పష్టం చేశాడు. తాను ఆ వ్యాఖ్యలను సాధారణంగా, సరదాగా అన్నానని, కానీ ఇప్పుడు అది తప్పు అని గ్రహించానని పేర్కొన్నాడు. దీంతో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో పాటు తన మాటల వల్ల బాధపడిన నెటిజన్లకు కూడా క్షమాపణలు చెప్పాడు. తన మాటలు ఇతరులకు బాధ కలిగించి ఉండొచ్చని, కానీ ఎవరి శారీరక ఆకృతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని మరోసారి వివరణ ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల తర్వాత ఎజాజ్ వారిస్ క్షమాపణలు చెప్పిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కత్రినా కైఫ్ గురించి గతంలో అతడు చేసిన వ్యాఖ్యలు, తాజాగా విడుదల చేసిన క్షమాపణల వీడియో నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా, సెలబ్రిటీల శారీరక ఆకృతి లేదా వ్యక్తిగత మార్పులను ఉద్దేశించి విమర్శలు చేయడంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో సల్మాన్ ఖాన్ క్లాస్ పీకిన తర్వాతే దారికొచ్చిన ఎజాజ్ వారిస్, తన తప్పును తెలుసుకుని కత్రినాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం గమనార్హం.

Leave a Reply