సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక కాకి తెలివితేటలను చాటిచెప్పే వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగానే పక్షులలో కాకులు ఎంతో తెలివైనవని చెబుతుంటారు; ఈ వీడియో ఆ విషయాన్ని మరోసారి రుజువు చేసేలా ఉంది.
వీడియోలో కాకి తన ముక్కున పట్టుకున్న బిస్కెట్ను నేరుగా తినకుండా, పక్కనే ఉన్న నీటిలో ముంచుతుంది. ఆ తర్వాత బిస్కెట్ మెత్తబడిన వెంటనే ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంది.
ఇందులో విశేషమేమిటంటే.. కాకి కేవలం ఒక్కసారి మాత్రమే అలా చేసి ఆగిపోలేదు. ప్రతిసారీ బిస్కెట్ ముక్కను నీళ్లలో ముంచి, కాసేపు నాననిచ్చి, ఆ తర్వాతే తింటోంది. గట్టిగా ఉన్న బిస్కెట్ను మెత్తగా చేసుకోవడం కోసమే కాకి ఈ పద్ధతిని పాటిస్తుండటం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు.. “ఈ కాకి మనకంటే తెలివైనదిగా ఉందే!” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
కాకుల తెలివితేటల గురించి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిన్నప్పుడు మనం చదువుకున్న దాహం వేసిన కాకి కథ కూడా దీనికి చక్కటి ఉదాహరణ. కూజాలో అడుగున ఉన్న నీటిని పైకి రప్పించేందుకు కాకి చిన్న చిన్న గులకరాళ్లను ఒక్కొక్కటిగా వేసి నీళ్లు తాగిందని ఆ కథలో చదువుకున్నాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లందరికీ ఆ చిన్ననాటి కథ గుర్తుకువస్తోంది.
“దాహం వేసిన కాకి” కథలో రాళ్లను ఉపయోగించి సమస్యను పరిష్కరించుకున్న కాకి.. ఇప్పుడు బిస్కెట్ను మెత్తగా చేసుకునేందుకు నీటిని ఉపయోగించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక చిన్న సమస్యను అర్థం చేసుకుని దానికి తగ్గ పరిష్కారాన్ని కాకి ఎంచుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పాత కథలో చదివిన కాకి, ఇప్పుడు సరికొత్త రూపంలో తన తెలివిని ప్రదర్శిస్తోందంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
