గోరఖ్‌పూర్: అహ్మదాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక ఎన్‌సిసి క్యాడెట్ యువతిపై టీటీఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పరీక్ష రాసేందుకు మౌ (Mau) వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉండటంతో టికెట్ తీసుకోలేకపోయింది.
ఆమె ఏసీ కోచ్‌లో నిలబడగా, సీటు ఇప్పిస్తాననే నెపంతో టీటీఈ ఆమెను తన క్యాబిన్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని జీఆర్‌పీ ఎస్పీ లక్ష్మీ నివాస్ మిశ్రా తెలిపారు.
అసలు ఏం జరిగింది? ఈ ఘటన ఆదివారం జరిగింది. బాధితురాలు మౌ నివాసి, గోరఖ్‌పూర్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్‌సిసి ‘సి’ సర్టిఫికేట్ పరీక్ష కోసం మౌ వెళ్లి తిరిగి వస్తుండగా, స్టేషన్‌లో రద్దీ వల్ల టికెట్ తీసుకోలేక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఎక్కింది. జరిమానా కట్టి సీటు తీసుకోవచ్చని ఆమె భావించింది. టీటీఈ రాహుల్ కుమార్ ఆమెను తన క్యాబిన్‌లోకి పిలిచి, వివరాలు అడిగి, ఆపై తలుపులు వేసి అమానుషానికి ఒడిగట్టాడు. యువతి 112 నంబర్‌కు ఫోన్ చేయడంతో, నిందితుడు దేవరియా స్టేషన్‌లో రైలు దిగి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
