“కన్నీరుమున్నీరైన పిల్లలు. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కోసం పిల్లలను వదిలేసిన తల్లి. పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా.!!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ, తన కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీకి చెందిన తన స్నేహితురాలితో కలిసి జీవించడానికి వెళ్లిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.

కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ, గత ఏడాదిగా తన స్నేహితురాలితో ఏర్పడిన సాన్నిహిత్యంతో భర్త, పిల్లలను పట్టించుకోకుండా ఆమెతోనే ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతూ గడిపేది. ఈ క్రమంలో గత సెప్టెంబర్ 6వ తేదీన ఆమె అకస్మాత్తుగా ఇల్లు వదిలి ఢిల్లీకి వెళ్లిపోయినట్లు సమాచారం.

భార్య కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా ఆధారంగా ముమ్మర దర్యాప్తు జరిపి ఢిల్లీలో ఉన్న ఆ మహిళను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

పోలీసులు, ఉన్నతాధికారులు ఆమెను విచారించగా, తాను తన స్నేహితురాలిని ఇష్టపడుతున్నానని, ఆమెతోనే కలిసి జీవించాలనుకుంటున్నానని ఆ మహిళ తేల్చి చెప్పింది.

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భర్త, ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటికి రావాలని బతిమిలాడినప్పటికీ, తాను పిల్లలతో కలిసి జీవించాలనుకోవడం లేదని, వారు వాళ్ల నాన్న దగ్గరే ఉండాలని ఆ మహిళ ఏమాత్రం కనికరం లేకుండా ఖరాఖండిగా చెప్పేసింది. సదరు మహిళ మేజర్ కావడంతో పాటు, తమకు ఇష్టమైన వారితో జీవించే హక్కును భారత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కల్పిస్తున్న నేపథ్యంలో, పోలీసులు ఆమెను తన స్నేహితురాలితో వెళ్లడానికి అనుమతించారు.

అయితే, ఈ వ్యవహారంపై న్యాయనిపుణులు స్పందిస్తూ.. చట్టం మేజర్లకు తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకునే హక్కును కల్పించినప్పటికీ, హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం (Hindu Adoptions and Maintenance Act) ప్రకారం పిల్లలకు తల్లి నుండి సరైన సంరక్షణ, భరణం పొందే పూర్తి హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ పిల్లలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, తల్లి వారి నిర్వహణ ఖర్చులను తప్పనిసరిగా భరించాల్సి ఉంటుందని వారు వివరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *