Taliban Girls Law: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన వచ్చినప్పటి నుండి మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు, ఆంక్షలకు కొదవ లేకుండా పోయింది. వారిని కొట్టడం, హింసించడమే కాకుండా, చదువుపై నిషేధం విధించడం, చివరకు బలవంతపు పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించడం వరకు వారి అరాచకాలు సాగుతున్నాయి.
ఈ క్రమంలోనే తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో వివాహం, విడాకులు మరియు బాల్య వివాహాలకు సంబంధించిన ఒక కొత్త కుటుంబ చట్టాన్ని (ఫ్యామిలీ లా) అమలులోకి తెచ్చింది. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మానవ హక్కుల సంఘాలు, మహిళా హక్కుల కార్యకర్తలు ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
అసలు ఆ చట్టం ఏమిటి? ఆఫ్ఘన్ మీడియా సంస్థ ‘అము టీవీ’ (Amu TV) కథనం ప్రకారం.. “ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్పౌజెస్” (Principles of Separation Between Spouses) పేరుతో 31 ఆర్టికల్స్ (అనుచ్ఛేదాలు) కలిగిన ఈ నియమావళిని మే మధ్యలో అధికారిక గెజెట్లో ప్రచురించారు. ఈ చట్టానికి తాలిబాన్ అత్యున్నత నాయకుడు హిబతుల్లా అఖుంద్ జాదా ఆమోదం తెలిపారు. ఈ పత్రంలో బాల్య వివాహాలు, విడాకులు, కనిపించకుండా పోయిన భర్త, బలవంతపు వేరుబాట్లు, మతమార్పిడి, వ్యభిచారం మరియు ఇతర మతపరమైన-చట్టపరమైన అంశాలకు సంబంధించిన నియమాలను చేర్చారు. ఇస్లామిక్ న్యాయశాస్త్రం ఆధారంగానే ఈ చట్టాన్ని రూపొందించినట్లు తాలిబాన్ పేర్కొంది.
కన్యల పట్ల వివాదాస్పద చట్టం: ఈ చట్టంలో అత్యంత వివాదాస్పదమైన నిబంధన ఏమిటంటే.. యవ్వన దశకు (మైనారిటీ తీరిన) వచ్చిన ఏ కన్య అయినా (Virgin Girl) పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మౌనంగా ఉంటే, దానిని ఆమె వివాహ సమ్మతిగా పరిగణించవచ్చు. అంటే, పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు అమ్మాయి ఏమీ మాట్లాడకుండా ఊరకుంటే, ఆమె ‘అవును’ అని ఒప్పుకున్నట్లేనని ఈ చట్టం చెబుతోంది.
అబ్బాయిలకు, వివాహిత మహిళలకు వేరే నియమం: ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇదే నియమం అబ్బాయిలకు లేదా ఇదివరకే వివాహం జరిగిన మహిళలకు వర్తించదు. వారి మౌనాన్ని అంగీకారంగా భావించలేమని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే విమర్శకులు దీనిని మహిళలు, బాలికల పట్ల తీవ్ర వివక్ష చూపే చట్టంగా అభివర్ణిస్తున్నారు.
‘ఖియార్ అల్-బులూగ్’ నియమం అంటే ఏమిటి? ఈ కొత్త ఉత్తర్వులలో “ఖియార్ అల్-బులూగ్” అనే ఇస్లామిక్ భావనను కూడా చేర్చారు. దీని ప్రకారం.. ఏదైనా చిన్న వయస్సులో (బాల్య వివాహం) ఒక బిడ్డకు పెళ్లి చేస్తే, ఆ బిడ్డ పెద్దయిన తర్వాత (యవ్వన దశకు వచ్చాక) ఆ వివాహాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.
బంధువులు కూడా మైనర్లకు పెళ్లి చేయవచ్చు: చట్టంలోని ఆర్టికల్ 5 ప్రకారం.. తండ్రి లేదా తాత కాకుండా ఇతర బంధువులు ఎవరైనా మైనర్ (బాలిక/బాలుడు) వివాహాన్ని నిశ్చయించినా, ఆ వివాహం చెల్లుబాటు అవుతుంది. అయితే, ఇందుకు కాబోయే జీవిత భాగస్వామి తగినవాడై ఉండాలని, కట్నకానుకల మొత్తం (మహర్) బాగుండాలని షరతు పెట్టారు.
కానీ వివాహం రద్దు చేసుకోవడం అంత సులువు కాదు: పెద్దయిన తర్వాత వివాహాన్ని రద్దు చేసుకునే అవకాశం పిల్లలకు ఉంటుందని చట్టం చెబుతున్నప్పటికీ, దీని కోసం తాలిబాన్ కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి. అంటే తుది నిర్ణయం కోర్టు చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి సరైనవాడు కాకపోయినా లేదా కట్నం తక్కువగా ఉన్నా అటువంటి వివాహాలు చెల్లుబాటు కావు. అయితే, ఇక్కడ భాగస్వామి సరైనవాడు కాకపోవడం అంటే ఏమిటి, కట్నం ఎంత ఉండాలి అనే విషయాలపై స్పష్టమైన నిబంధనలు లేవు.
తండ్రి, తాతలకు విస్తృత అధికారాలు: ఈ కొత్త నియమం ప్రకారం బాల్య వివాహాలకు సంబంధించి తండ్రి, తాతలకు విస్తృత అధికారాలు ఇచ్చారు. అయితే, తల్లిదండ్రులు ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, మానసికంగా అస్వస్థతతో ఉన్నా లేదా నైతికంగా దిగజారిపోయినట్లు రుజువైతే అటువంటి వివాహాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించవచ్చు.
తాలిబాన్ జడ్జీలకు మరిన్ని అధికారాలు: ఈ పత్రం తాలిబాన్ న్యాయమూర్తులకు (జడ్జీలకు) అనేక వ్యక్తిగత, మతపరమైన విషయాలలో జోక్యం చేసుకునే అధికారాన్ని ఇస్తుంది. ఇందులో వ్యభిచారం, మతమార్పిడి, భర్త సుదీర్ఘకాలం గైర్హాజరు కావడం మరియు “జిహార్” వంటి వివాదాలు ఉన్నాయి.
‘జిహార్’ అంటే ఏమిటి? ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ‘జిహార్’ అనేది ఒక భావన. ఇందులో భర్త తన భార్యను మతపరంగా వివాహం చేసుకోవడం నిషిద్ధమైన తన తల్లి లేదా సోదరి వంటి రక్తసంబంధీకురాలితో పోలుస్తాడు. కొత్త చట్టం ప్రకారం ఇటువంటి కేసులలో తాలిబాన్ కోర్టులు విడాకులు, శిక్ష లేదా జైలు శిక్ష కూడా విధించవచ్చు.
2021 తర్వాత నిరంతర ఆంక్షలు: ఆగస్టు 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాలిబాన్ మహిళలు, బాలికలపై నిరంతరం ఆంక్షలు విధిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త చట్టం రావడం అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై ఆందోళనలను మరింత పెంచింది.
బాలికల చదువుపై ఇప్పటికే నిషేధం: ఆఫ్ఘనిస్తాన్లో బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత చదువు కొనసాగించడానికి అనుమతి లేదు. మహిళలు విశ్వవిద్యాలయాలకు (యూనివర్సిటీలు) వెళ్లకుండా కూడా నిషేధించారు. ఇవి కాకుండా ఉద్యోగాలు, ప్రయాణాలు మరియు బహిరంగ జీవితంలో పాల్గొనడంపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.
ఎంతమంది బాలికలకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు? ‘గర్ల్స్ నాట్ బ్రైడ్స్’ (Girls Not Brides) సంస్థ నివేదికల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు మూడో వంతు బాలికలకు 18 ఏళ్లు నిండక ముందే వివాహాలు జరుగుతున్నాయి. అందుకే ఈ కొత్త చట్టంపై ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఎందుకంటే మైనర్లు సరైన నిర్ణయం తీసుకోలేరు, అలాంటిది వారి మౌనాన్ని అంగీకారంగా భావించడం చాలా ప్రమాదకరం. ఇది వారి గొంతును పూర్తిగా నొక్కేయడమే అవుతుంది.
