కన్యగా నమ్మించి పెళ్లి: ఏడేళ్ల తర్వాత బయటపడ్డ భార్య బండారం!

ఆగ్రా: భార్య తనను మోసం చేసిందని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించిన ఘటన ఆగ్రాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మోన అనే మహిళ తాను పెళ్లి కాని కన్య అని అబద్ధం చెప్పి సంజయ్ చాహర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్దిరోజులకే నగలతో పుట్టింటికి వెళ్లిన ఆమె, తిరిగి రాకపోగా అసలు విషయం బయటపడింది.

సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం, 2018 ఆగస్టు 31న ఢిల్లీలోని ఆర్య సమాజ్ మందిరంలో మోనతో వివాహం జరిగింది. పెళ్లికి ముందు మోన తానూ అవివాహితురాలినని అఫిడవిట్ కూడా ఇచ్చింది. వివాహం తర్వాత సంజయ్ తల్లి ఆమెకు బంగారు నగలు, వెండి పట్టీలను బహుమతిగా ఇచ్చారు. 2019 ఏప్రిల్ 19న మోన తన తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్లి, రెండు వారాల్లో వస్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.

కాలక్రమేణా, అలీగఢ్‌కు చెందిన ఒక వ్యక్తి ద్వారా మోనకు ఇదివరకే మనోజ్ అనే వ్యక్తితో పెళ్లయిందని, వారికి ఒక కుమార్తె కూడా ఉందని సంజయ్‌కు తెలిసింది. అంతేకాకుండా వారిద్దరికీ ఇంకా విడాకులు కాలేదని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సంజయ్‌కు దొరికాయి. 2025 ఆగస్టు 17న అలీగఢ్‌లోని ఒక హోటల్‌లో మోనను దీని గురించి అడగగా, ఆమె తన బంధువులను పిలిపించి సంజయ్‌ను దుర్భాషలాడటమే కాకుండా, తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. దీనిపై బాధితుడు కోర్టు ద్వారా ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: