కళ్లల్లో కారం కొట్టి.. ₹4.5 లక్షలు కాజేసిన ఘరానా దొంగ.. SBI బ్రాంచీలో పట్టపగలే దోపిడీ.. 30 నిమిషాల్లోనే పట్టుకున్న పోలీసులు.. మహారాష్ట్రలో కలకలం.!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సూరజ్ భోజ్‌రాజ్ భోర్కర్ (28) అనే యువకుడు, ముఖానికి మాస్క్ ధరించి ఖాతాదారుడిలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచీలోకి ప్రవేశించాడు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే, తన వెంట తెచ్చుకున్న కారంపొడిని విధుల్లో ఉన్న బ్యాంకు సిబ్బంది కళ్లల్లో అకస్మాత్తుగా చల్లాడు. తీవ్రమైన కంటి మంటతో సిబ్బంది విలవిల్లాడుతున్న అదును చూసి, అక్కడున్న సుమారు ₹4.53 లక్షల నగదును బ్యాగ్‌లో కుక్కుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ మెరుపు దాడితో బ్యాంకు ప్రాంగణంలో తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే తేరుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలన్నీ బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అనంతరం ఈ విజువల్స్ సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.

సమాచారం అందుకున్న నాగ్‌పూర్ సక్కర్‌దరా పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్, నిందితుడు పారిపోయిన మార్గాలను జల్లెడ పట్టారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి, దోపిడీ జరిగిన కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి దోచుకెళ్లిన ₹4.53 లక్షల నగదు మొత్తాన్ని రికవరీ చేశారు.


Posted

in

by

Tags: