ముగలకోడ్: భక్తులు తమ కోరికలు నెరవేరాలని దేవాలయాల్లో రకరకాల మొక్కులు మొక్కుతుంటారు. అయితే, కర్ణాటకలోని ముగలకోడ్ పట్టణ సమీపంలో ఉన్న ఖనదాల గ్రామంలోని ఒక ఆలయ హుండీలో లభించిన వింత లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్తగారి వేధింపులు తట్టుకోలేక, ఆమెను తిరిగి పైకి (భగవంతుడి వద్దకు) తీసుకెళ్లిపోవాలని ఒక కోడలు రాసిన కోరిక ఆ లేఖలో ఉంది.
ఖనదాలలోని హులికాంతేశ్వర ఆలయ ఉత్సవాల అనంతరం కానుకల పెట్టెను తెరిచినప్పుడు ఈ వింత లేఖ బయటపడింది. ఫిబ్రవరి 13 నుండి 17 వరకు ఇక్కడ ఉత్సవాలు జరిగాయి.
లేఖలో ఏముందంటే? “వచ్చే ఏడాది ఉత్సవాల లోపు నా కష్టాలు తీర్చి, మా అత్తయ్యను తిరిగి నీ దగ్గరకు పిలిచేసుకో (చనిపోయేలా చేయి)” అని ఆ లేఖలో రాసి ఉంది. తెల్ల కాగితంపై రాసిన ఈ కోరికతో పాటు ఒక వంద రూపాయల నోటును కూడా చుట్టి హుండీలో వేశారు. ఈ వింత కోరిక చూసి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అవాక్కయ్యారు. ఇంతకీ ఈ పని చేసింది ఎవరా అని ఆరా తీస్తున్నారు.
నిర్వాహకుల స్పందన: “అత్తగారి వేధింపులు భరించలేక కోడలు ఈ పని చేసిందా లేదా అల్లుడు చేసిందా అనేది స్పష్టంగా తెలియదు. ఏళ్ల తరబడి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కానీ, ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. ఆలయంలోని రెండు వేర్వేరు హుండీల్లో ఇలాంటివే రెండు లేఖలు లభించాయి” అని ఆలయ కమిటీ సభ్యుడు శంకర్ సుతార్ స్థానిక మీడియాకు తెలిపారు.
పాత రోజుల్లో కుటుంబ సభ్యులంతా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మొక్కుకునేవారని, కానీ నేటి కాలంలో అత్తగారు చనిపోవాలని మొక్కుకునే వింత పరిస్థితులు వచ్చాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పెద్దల పట్ల గౌరవం, భయం లేని వారే ఇలాంటి పనులు చేస్తారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
