‘కాబా-మదీనా’ పాట పాడిన సాయోని ఘోష్.. TMC ఓటమి తర్వాత కూడా తగ్గేదేలే! ఏమన్నారంటే?

కోల్‌కతా: “హృదయ్ మా ఛే కాబా, నయనే మదీనా…” (గుండెల్లో కాబా, కళ్ళలో మదీనా) అంటూ ఎన్నికల వేదికలపై ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పాటలు పాడి వార్తల్లో నిలిచిన టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్, ఎన్నికల్లో పార్టీ ఓటమి మరియు బీజేపీ విజయంపై తొలిసారి స్పందించారు.

బీజేపీకి అభినందనలు తెలుపుతూనే, కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తన పోరాటం ఇకపై మరింత తీవ్రంగా మరియు ఉగ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

తీర్పును అంగీకరిస్తూనే ఆరోపణలు
జాదవ్‌పూర్ ఎంపీ, బెంగాలీ నటి-గాయని అయిన సాయోని ఘోష్.. టీఎంసీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అనేక కుతంత్రాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. “బెంగాల్ ప్రజలు బీజేపీకి ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నాను. కష్టసుఖాల్లో మాకు తోడుగా నిలిచిన బెంగాల్ ‘మా-మాటి-మానుష్’ (తల్లి-నేల-ప్రజలు) కు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

మమతకు అండగా..
పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ, మమతా బెనర్జీ పట్ల తన విధేయతను చాటుకున్నారు. “జాదవ్‌పూర్ లోక్‌సభ ప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తూనే, నా నాయకురాలు మమతా బెనర్జీకి అంకితభావంతో ఉంటాను. ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడటానికి ఆమెతో భుజం భుజం కలిపి నిలబడతాను” అని సాయోని చెప్పారు.

పోరాటం మరింత ఉగ్రం
బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. “కేంద్ర సంస్థల వేధింపులు, కనిపించని ఎన్నికల అక్రమాలు, నిధుల నిలిపివేత, మీడియా ట్రయల్స్, అక్రమ అరెస్టులు.. ఇలాంటి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేము వెనక్కి తగ్గలేదు. ఇకపై మా పోరాటం మరింత తీవ్రంగా ఉంటుంది. బెంగాల్ ప్రజల హక్కుల కోసం టీఎంసీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. జై బంగ్లా! జై హింద్!” అని ఆమె వ్యాఖ్యానించారు.

టీఎంసీ ఓటమిలో సాయోని పాత్రపై చర్చ
టీఎంసీ ఓటమికి గల కారణాలలో సాయోని ఘోష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆమె బహిరంగ వేదికలపై ‘కాబా-మదీనా’ వంటి ఇస్లామిక్ గీతాలు పాడటం పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ చేసింది. ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో మరో వర్గంలో (హిందూ ఓటర్లలో) తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇది హిందూ ఓట్ల ఏకీకరణకు (Polarization) దారితీసి, బీజేపీకి ‘డబుల్ సెంచరీ’ (206 సీట్లు) సాధించడంలో పరోక్షంగా సహాయపడిందని భావిస్తున్నారు. పదేళ్ల క్రితం కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీ, నేడు బెంగాల్‌ను కైవసం చేసుకోవడం వెనుక ఇటువంటి పరిణామాలు కూడా ఉన్నాయని చర్చ జరుగుతోంది.


Posted

in

by

Tags: