నాసిక్: మహారాష్ట్రను కుదిపేస్తున్న ‘నకిలీ బాబా’ అశోక్ ఖరాత్ అలియాస్ కెప్టెన్ బాబా పాపాల పుట్ట పగులుతోంది. దైవ సమానుడిగా భావించి ఏ పాదాలనైతే భక్తులు తలపై పెట్టుకున్నారో, అవే పాదాల కింద ఒక అబల జీవితాన్ని ఎలా తొక్కేశాడో తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తాజాగా ఒక బాధితురాలు బయటపెట్టిన నిజాలు సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.
“నీకు తండ్రిని నేనే.. కన్యదానం చేస్తాను”
ఈ దారుణానికి వ్యతిరేకంగా గళమెత్తి మొదటి ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేసిన బాధితురాలు, బాబా చేసిన మోసాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. ఆమె మాటల్లోనే..
“నేను 2019లో మొదటిసారి అశోక్ ఖరాత్‌ను కలిశాను. అప్పుడు అతను నా తలపై చేయి పెట్టి, ‘నువ్వు నా ప్రాణ సమానమైన కూతురివి.. నీ పెళ్లికి కన్యదానం నేనే చేస్తాను’ అని నమ్మబలికాడు. ఆ మాటలకు మురిసిపోయిన నేను, నా కుటుంబం అతడిని దైవంలా నమ్మాము.”
సిద్ధపూజ పేరుతో గదిలోకి పిలిచి..
2022లో బాధితురాలికి వివాహం నిశ్చయమైంది. ఆశీర్వాదం కోసం కాబోయే భర్తతో కలిసి వెళ్లిన ఆ యువతికి బాబా ఒక విషవలయం విసిరాడు. భవిష్యత్తు బాగుండాలంటే ‘ఈశాన్యేశ్వర మహాదేవ ఆలయం’లో సిద్ధపూజ చేయాలని, దానికి ఒక రోజు ముందే రావాలని నమ్మించాడు.
- మత్తు ప్రసాదం: పూజా విధానం వివరిస్తాననే నెపంతో ఆమెను తన ఆఫీసు గదిలోకి పిలిచిన బాబా, లోపలి నుంచి తలుపులు గడియ పెట్టాడు. భయపడవద్దని చెప్తూనే, ఒక పుష్యరాగం రాయిని ఇస్తానని నమ్మబలికాడు. అనంతరం ప్రసాదం పేరుతో ఆమెకు ఏదో తినిపించగా, అది తిన్న వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది.
- మూడేళ్ల నరకం: ఆమె స్పృహలో లేని సమయంలో మొదటిసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు (నవంబర్ 2022 నుండి డిసెంబర్ 2025 వరకు) ఆమెకు మత్తు పదార్థాలు ఇస్తూ నిరంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు.
కుటుంబం అరెస్ట్.. భయటపడుతున్న నిజాలు
అశోక్ ఖరాత్ చేసిన ఈ అకృత్యాలకు అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించినట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే వారిని అరెస్ట్ చేశారు. పరువు పోతుందనే భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని, కానీ ఆ దొంగ బాబా ముసుగు తొలగించడానికే ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చానని బాధితురాలు పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఘటన నాసిక్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. భక్తి ముసుగులో కామవాంఛలు తీర్చుకుంటున్న ఇలాంటి కిరాతకులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
