అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫెయిర్‌ఫీల్డ్ సమీపంలో, టెస్లా కారు ఒకటి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని బలంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
మంగళవారం రాత్రి ఇంటర్‌స్టేట్ 80 (I-80) హైవేపై అంతకుముందు జరిగిన వేరొక ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఆ ప్రాంతంలో రహదారిపై కొన్ని లేన్లను మూసివేసి, వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ట్రాఫిక్ కోన్లు, బ్లింకర్లు మరియు ఎమర్జెన్సీ వార్నింగ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో, అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్‌ను ఉపయోగిస్తూ వచ్చిన టెస్లా కారు, ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా వేగంగా వెళ్లి అక్కడ నిలిపి ఉంచిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది.
ఆ కారును నడుపుతున్న వ్యక్తి శాక్రమెంటో ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడని తెలిసింది. టెస్లా ‘ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్’ (FSD) మోడ్‌ను ఆన్ చేసిన సమయంలో తాను నిద్రలోకి జారుకున్నట్లు అతడు పోలీసులకు తెలిపాడు. ఈ ప్రమాదంలో సదరు యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, పోలీస్ వాహనంలో ఉన్న ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత చికిత్స పొందిన అనంతరం మరుసటి రోజు వారిద్దరూ డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన డ్యాష్‌క్యామ్ వీడియో దృశ్యాలను కాలిఫోర్నియా హైవే పెట్రోల్ విభాగం విడుదల చేసింది. రోడ్డుపై స్పష్టమైన హెచ్చరిక ఏర్పాట్లు ఉన్నప్పటికీ కారు వచ్చి ఢీకొట్టిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
ఈ ఘటన ఆధునిక కార్లలోని ఆటోమేషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పుడు డ్రైవర్లు పాటించాల్సిన భద్రతా నిబంధనలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. టెస్లా దీనికి ‘ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్’ అని పేరు పెట్టినప్పటికీ, ఇది డ్రైవర్ పర్యవేక్షణ లేకుండా పూర్తిగా దానంతట అదే నడిచే వ్యవస్థ కాదు.
రహదారి పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, అవసరమైన సమయంలో వెంటనే వాహన నియంత్రణను చేతుల్లోకి తీసుకునే బాధ్యత పూర్తిగా డ్రైవర్‌పైనే ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ ఫీచర్‌ను నమ్ముకుని నిద్రపోవడం లేదా రోడ్డుపై దృష్టి సారించకపోవడం ప్రాణాంతకమని స్పష్టమవుతోంది. ఈ ప్రమాదంపై కాలిఫోర్నియా హైవే పెట్రోల్ విభాగం విచారణ జరుపుతుండగా.. ఎన్ని అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినా డ్రైవర్ వ్యక్తిగత అప్రమత్తతకు ప్రత్యామ్నాయం ఏదీ ఉండదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

Leave a Reply