సింగపూర్: సింగపూర్ అనగానే చాలా మందికి అక్కడ ఆకాశాన్ని తాకే భవనాలు, నోరెళ్లబెట్టేలా చేసే ఎయిర్పోర్ట్, రోడ్లపై దూసుకెళ్లే అత్యాధునిక కార్లే గుర్తొస్తాయి.
కానీ, అక్కడ ఆ కారు కొనాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఒక చిన్న కారు కొనడానికి కూడా అక్కడ రూ.85 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందట. దీని గురించి మనం వివరంగా చూద్దాం!
ఆగ్నేయాసియాలో అత్యంత ముఖ్యమైన దేశంగా ఉన్న సింగపూర్ ఎన్నో విషయాలలో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. సురక్షితమైన దేశం, అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్, పరిశుభ్రమైన నగరం ఇలా పలు విషయాల్లో సింగపూర్ అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యింది.
సింగపూర్ సింగపూర్‌కు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ.. ప్రపంచంలోనే కారు కొనడానికి అత్యధిక ఖర్చయ్యే దేశాల్లో సింగపూర్ ఒకటిగా ఉంది. ఉదాహరణకు, మీరు అక్కడ ఒక చిన్న కారు కొనాలని అనుకుంటున్నారు అనుకుందాం. దానికి కూడా దాదాపు 1 లక్ష అమెరికన్ డాలర్లు, అంటే సుమారు రూ.85 లక్షలు ఖర్చవుతుంది. ఇది లగ్జరీ కార్ల ధర కాదు.. కేవలం ఒక సాధారణ చిన్న కారుకు అయ్యే ఖర్చు!
అక్కడ కారు అసలు ధర తక్కువే అయినప్పటికీ, కారు కొనడానికి కచ్చితంగా కలిగి ఉండాల్సిన COE అంటే ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎంటైటిల్మెంట్’ (Certificate of Entitlement – వాహన యాజమాన్య హక్కు పత్రం) ధర ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణం. ఈ సీఓఈ (COE) సర్టిఫికేట్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
అసలేమిటి ఈ సీఓఈ (COE)? సింగపూర్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు, వాహనాల సంఖ్యను నియంత్రించడానికి సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిే ఈ సీఓఈ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఉంటేనే ఎవరైనా కారు కొనగలరు. ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో మాత్రమే COEలను జారీ చేస్తారు. వీటిని కూడా వేలం (Auction) పద్ధతిలోనే కేటాయిస్తారు. గత జూలై 8న జరిగిన వేలంలో 1.6 లీటర్ల కంటే తక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న చిన్న కార్ల COE ధర 1.29 లక్షల సింగపూర్ డాలర్లకు పెరిగింది. అంటే దీని భారతీయ విలువ సుమారు రూ.86 లక్షలు.
చాలా ఖరీదైనది ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి COE కొన్నా, కేవలం ఒకే ఒక్క కారును మాత్రమే కొనగలరు. దానిని కూడా కేవలం 10 సంవత్సరాల వరకు మాత్రమే ఉంచుకోవడానికి వీలవుతుంది. కరోనాకు ముందటి ధరలతో పోలిస్తే, చిన్న కార్ల COE ధర ప్రస్తుతం 4 రెట్లు పెరిగింది. గత ఏడాది కూడా ఇది 1.02 లక్షల సింగపూర్ డాలర్లుగా ఉండగా, కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1.3 లక్షల సింగపూర్ డాలర్లకు చేరుకుంది.
సింగపూర్‌లో ప్రస్తుతం ఒక COE ధర అనేది అమెరికాలో 4 టొయోటా కరోలా (Toyota Corolla) కార్లను కొనే ఖర్చుతో సమానం. అంటే కారు కొనడానికి ముందే యాజమాన్య హక్కు పత్రం కోసమే భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
ఇల్లే కొనేయొచ్చు సింగపూర్‌లో ఒక కుటుంబం యొక్క సగటు వార్షిక ఆదాయం 1.49 లక్షల సింగపూర్ డాలర్లు మాత్రమే. పైగా, అక్కడ ప్రభుత్వ రాయితీతో లభించే చిన్న ఇళ్ల ప్రారంభ ధర కూడా దాదాపు 1.39 లక్షల సింగపూర్ డాలర్లుగా ఉంది. అంటే మీరు ఒక ఇంటి విలువతో సమానమైన డబ్బును పెట్టి అక్కడ కారు కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
సుమారు 61 లక్షల జనాభా మాత్రమే ఉన్న సింగపూర్‌లో, మీరు ఒక చివర నుండి మరో చివరకు కేవలం ఒక గంట లోపే చేరుకోవచ్చు. భూభాగం చాలా తక్కువగా ఉండటం వల్లే, రోడ్లపై వాహనాల రద్దీని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ COE విధానాన్ని ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తోంది.
