బెంగళూరు నుంచి తమిళనాడు వైపు కారులో తరలిస్తున్న లెక్కల్లో చూపని రూ.9 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బెంగళూరు నుంచి హోసూరు మీదుగా తమిళనాడుకు లెక్క చూపని లేదా నిషేధిత భారీ నగదును కారులో తరలిస్తున్నట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులకు రహస్య సమాచారం అందింది.
దీంతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసూరు రోడ్డు బీఈటీఎల్ (BETL) టోల్‌గేట్ సిగ్నల్ వద్ద రాత్రి వేళల్లో ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన కారును పోలీసులు చాకచక్యంగా అడ్డగించి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆ వాహనంలో తనిఖీలు చేయగా, రహస్యంగా దాచి ఉంచిన కోట్ల రూపాయల నగదు బయటపడింది.
ఈ ఘటనతో సంబంధం ఉన్న తూత్తుకుడికి చెందిన సింధు జ్యువెలరీ సంస్థతో సంబంధాలున్న సచిన్ (42) అనే వ్యక్తితో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ వాహనాన్ని, పట్టుబడిన వ్యక్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు.
దీనికి కొనసాగింపుగా తమిళనాడులో నిర్వహించిన తనిఖీల్లో కూడా మరికొన్ని లక్షలు, కోట్ల రూపాయల నగదు పట్టుబడటంతో.. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అనే కోణంలో అధికారులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply