వరల్డ్ కిడ్నీ డే 2026: మూత్రపిండాల వ్యాధిని తరచుగా “సైలెంట్ కండిషన్” అని పిలుస్తారు, ఎందుకంటే దీని లక్షణాలు ప్రారంభ దశలో చాలా స్వల్పంగా ఉంటాయి. అయితే, కిడ్నీలు ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మన శరీరంలో – ముఖ్యంగా కాళ్లలో – కొన్ని మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్‌లోని నెఫ్రాలజీ విభాగం లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ తోపోతి ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నీ సమస్యలను సూచించే ఆ 5 లక్షణాలు ఇవే:
- కాళ్లు, చీలమండలు లేదా పాదాల వాపు
మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నప్పుడు కనిపించే అత్యంత సాధారణ లక్షణం కాళ్ల వాపు. దీనిని వైద్య పరిభాషలో ‘పెరిఫెరల్ ఎడెమా’ అని పిలుస్తారు. ఆరోగ్యకరమైన కిడ్నీలు శరీరంలోని అదనపు ఉప్పు మరియు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. కిడ్నీల పనితీరు తగ్గితే, ఆ ద్రవాలు శరీరంలో పేరుకుపోయి, గురుత్వాకర్షణ ప్రభావం వల్ల కాళ్లు, చీలమండల వద్దకు చేరుతాయి.
గుర్తించడం ఎలా?: సాయంత్రం సమయానికి చీలమండల వద్ద వాపు రావడం, కాళ్లపై సాక్స్‌ల గుర్తులు లోతుగా పడటం లేదా వాపు ఉన్న చోట వేలితో నొక్కితే గుంటలా పడటం (పిట్టింగ్ ఎడెమా).
- కాళ్లు బరువుగా లేదా బిగుతుగా అనిపించడం
కొంతమందిలో కిడ్నీ సమస్యల వల్ల రోజంతా కాళ్లు బరువుగా, బిగుతుగా లేదా నొప్పిగా అనిపిస్తాయి. కిడ్నీలు వ్యర్థాలను సరిగ్గా వడపోయక ద్రవాలు పేరుకుపోవడం వల్ల ఈ అనుభూతి కలుగుతుంది. ఇలా నిరంతరం అనిపిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. - కండరాల బలహీనత మరియు సత్తువ తగ్గడం
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD) ఉన్నవారిలో కండరాల బలం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత, మూత్రం ద్వారా ప్రోటీన్ కోల్పోవడం మరియు దీర్ఘకాలిక వాపుల వల్ల కాళ్లలో బలం తగ్గి నడవడం, మెట్లు ఎక్కడం లేదా బ్యాలెన్స్ తప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. - కాళ్లలో తిమ్మిర్లు లేదా మంటలు
కిడ్నీలు రక్తంలోని విషతుల్యాలను (Toxins) బయటకు పంపడంలో విఫలమైనప్పుడు, ఆ వ్యర్థాలు నరాలపై ప్రభావం చూపుతాయి. దీనిని ‘యురేమిక్ న్యూరోపతి’ అంటారు. దీనివల్ల పాదాలు, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు లేదా పిన్నులతో గుచ్చినట్లు (Pins and needles) అనిపిస్తుంది. డయాలసిస్ అవసరమైన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. - రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (RLS)
కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లను నిరంతరం కదిలించాలనే బలమైన కోరిక కలగడాన్ని ‘రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్’ అంటారు. ఇది రాత్రివేళల్లో ఎక్కువగా ఉండి నిద్రకు భంగం కలిగిస్తుంది. సాధారణ ప్రజల కంటే కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య 2 నుండి 3 రెట్లు ఎక్కువగా కనిపిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ లక్షణాలు ఎందుకు ముఖ్యం?
చాలామంది తమకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లు అది ముదిరే వరకు గుర్తించలేరు. కాబట్టి కాళ్ల వాపుతో పాటు మూత్రం తక్కువగా రావడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. సీరం క్రియేటినిన్, eGFR మరియు యూరిన్ అల్బుమిన్ వంటి సాధారణ పరీక్షల ద్వారా కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.
జాగ్రత్తలు:
బీపీ, షుగర్ నియంత్రణ: డయాబెటిస్ మరియు రక్తపోటు కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు.
పెయిన్ కిల్లర్స్ వద్దు: డాక్టర్ సలహా లేకుండా తరచుగా పెయిన్ కిల్లర్స్ (NSAIDs) వాడటం కిడ్నీలను దెబ్బతీస్తుంది.
ఆరోగ్యకరమైన అలవాట్లు: తగినంత నీరు తాగడం, బరువు అదుపులో ఉంచుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు.
