బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర హత్య ఉదంతం వెలుగుచూసింది. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యను తీసుకెళ్లడానికి ఓ భర్త అక్కడికి వెళ్లాడు. ఆమె కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. అయితే, ఆమె రానని నిరాకరించడంతో అప్పటివరకు నటన నటించిన అతనిలోని రాక్షసుడు ఒక్కసారిగా బయటపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
కర్ణాటక పోలీసుల సమాచారం ప్రకారం.. మృతురాలిని మంజుల (34)గా గుర్తించారు. ఆమె మహాదేవపుర పోలీస్ స్టేషన్లో హోంగార్డ్‌గా పనిచేస్తోంది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఆమె భర్త ప్రదీప్ కుమార్ (38)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు వృత్తిరీత్యా ఆటో రిక్షా డ్రైవర్.
పుట్టిట్లోనే ఉంటున్న భార్య:
భర్త ప్రదీప్‌తో తరచూ గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయిన మంజుల.. గత నెల రోజులుగా తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఉదయ్‌నగర్‌లోని తన తల్లిగారి ఇంట్లో ఉంటోంది. ఆదివారం సాయంత్రం ప్రదీప్ కుమార్ గొడవలను సర్దుబాటు చేసుకుని కాపురానికి తీసుకెళ్లే బహానాతో అత్తగారింటికి వెళ్లాడు. మంజుల తన పిల్లలను తీసుకుని సొంత ఇంటికి తిరిగి రావాలని అతడు కోరాడు, కానీ అందుకు మంజుల స్పష్టంగా నిరాకరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజుల రానని చెప్పడంతో ప్రదీప్ ఒక్కసారిగా ఆమె కాళ్లపై పడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు. అయితే, ఆమె నమ్మడం లేదని గ్రహించి, సమయం చూసి తన జేబులో నుంచి కత్తిని తీసి ఆమెపై వరుసపెట్టి దాడికి దిగాడు.
తల్లిని కాపాడబోయి కూతురికి గాయాలు:
ఈ దాడిపై బెంగళూరు సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మృతురాలి శరీరంపై కనీసం ఎనిమిది కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రదీప్ భార్యను నరుకుతుండగా.. వారి 14 ఏళ్ల కుమార్తె మధ్యలోకి వచ్చి తన తల్లిని కాపాడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేతి వేలికి తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావమైన మంజులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
హత్య తర్వాత ఆత్మహత్యాయత్నం:
భార్యను కిరాతకంగా చంపిన తర్వాత ప్రదీప్ ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ఆ తర్వాత అతడే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి.. తాను తన భార్యను హత్య చేసినట్లు సమాచారం ఇచ్చాడు. అనంతరం ప్రదీప్ తన చేతి మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
వీరికి వివాహమై 15 ఏళ్లు అవుతోంది. అయితే ప్రదీప్‌కు ఉన్న బెట్టింగ్‌లు, ఆన్లైన్ గేమింగ్ మరియు మద్యపాన వ్యసనాల కారణంగా వీరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ వ్యసనాల వల్ల కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి తోడు ప్రదీప్‌కు తన భార్య ప్రవర్తనపై కూడా అనుమానం (అనుమానపు పిచ్చి) ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు.

Leave a Reply