కిలో 3 లక్షల రూపాయల మామిడి పండు! పంటను చూసి ఆశ్చర్యపోయిన రైతు.. కాపలా కోసం రాత్రంతా చేతిలో లాఠీతో నిద్రలేకుండా.. అసలు కథేమిటంటే?

సాధారణంగా మామిడి పండు ధర కిలో వందలో లేదా వేలల్లో ఉంటుంది. కానీ, కిలో పండ్ల ధర ఏకంగా లక్షల్లో ఉంటుందని అంటే నమ్మగలరా? ఇది నిజం. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా, తాంసా గ్రామానికి చెందిన దేబా పాడియామి అనే రైతు అడవిలో దొరికే ఒక మొక్కను పెంచగా, అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజాకి’ మామిడి చెట్టుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర కిలోకు రూ. 3 లక్షల వరకు పలుకుతుంది.

‘మియాజాకి’ ప్రత్యేకత: ఈ మామిడి రకాన్ని జపాన్‌లో ‘తైయో నో తమాగో’ (సూర్యుడి గుడ్డు – Egg of the Sun) అని పిలుస్తారు. ఇవి సాధారణ పసుపు రంగు మామిడి పండ్లలా కాకుండా, ముదురు ఎరుపు-ఊదా రంగులో ఉంటాయి. వీటిలో ఉండే అద్భుతమైన రుచి, నాణ్యత మరియు యాంటీ-ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లుగా గుర్తింపు పొందాయి.

4 ఏళ్ల కష్టం: సుమారు 4 ఏళ్ల క్రితం ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన చిన్న మొక్కను దేబా పాడియామి చాలా జాగ్రత్తగా పెంచారు. ఒడిశా వాతావరణం, కఠిన పరిస్థితులను తట్టుకుని, ఇప్పుడు ఆ చెట్టుకు పండ్లు కాశాయి. ఈ అరుదైన పండ్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

రైతు పడుతున్న ఆవేదన: కోట్లాది రూపాయల విలువైన పంట చేతికి రావడంతో రైతు దేబాకు ఆనందంతో పాటు ఆందోళన మొదలైంది. రాత్రి వేళ ఎవరైనా ఈ పండ్లను దొంగిలిస్తారేమోనన్న భయంతో, ఆ రైతు చేతిలో లాఠీ పట్టుకుని చెట్టు కిందే నిద్రిస్తూ పంటకు కాపలా కాస్తున్నాడు. అయితే, ఈ పండ్లను ఎక్కడ అమ్మాలి? ధరను ఎలా నిర్ణయించాలి? వీటిని రవాణా చేయడం ఎలా? వంటి విషయాలపై సరైన అవగాహన లేకపోవడంతో ఆ రైతు అయోమయంలో ఉన్నాడు.


Posted

in

by

Tags: