భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. వీరందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత లోకో పైలట్లదే. కేవలం రైలును నడపడమే కాకుండా.. సిగ్నల్స్‌ను గమనించడం, ట్రాక్ పరిస్థితిని చూడటం, క్యాబిన్‌లోని పరికరాలను పర్యవేక్షించడం వంటి ఎన్నో బాధ్యతలు వీరిపై ఉంటాయి.
ప్రారంభ జీతం మరియు అలవెన్సులు: ఒక అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ప్రాథమిక వేతనం (Basic Pay) నెలకు ₹19,900 నుండి ప్రారంభమవుతుంది. అయితే, 7వ వేతన సంఘం ప్రకారం.. వివిధ అలవెన్సులు కలిపితే ఒక స్టార్టర్ నెలకు ₹25,000 నుండి ₹35,000 వరకు అందుకోవచ్చు.
అనుభవంతో పెరిగే ఆదాయం: అనుభవం పెరిగే కొద్దీ జీతం భారీగా పెరుగుతుంది. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపే సీనియర్ పైలట్లకు నెలకు ₹60,000 నుండి ₹78,000 వరకు లభిస్తుంది. అదే అతివేగ రైళ్లను (వందే భారత్ వంటివి) నడిపేవారికి నెలకు ₹90,000 పైగా అందుతుంది. దశాబ్దాల అనుభవం ఉన్న అధికారులు నెలకు లక్షకు పైగా జీతం తీసుకుంటారు.
కీలకమైన ‘రన్నింగ్ అలవెన్స్’: లోకో పైలట్ జీతంలో అతి ముఖ్యమైనది ‘రన్నింగ్ అలవెన్స్’. వీరు ప్రయాణించే ప్రతి కిలోమీటర్‌కు ప్రత్యేకంగా డబ్బు చెల్లిస్తారు. దీనితో పాటు కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), నైట్ డ్యూటీ అలవెన్సులు వీరి ఆదాయాన్ని మరింత పెంచుతాయి.
అదనపు ప్రయోజనాలు: జీతంతో పాటు రైల్వే ఆసుపత్రులలో ఉచిత వైద్యం, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు, దేశవ్యాప్తంగా కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన ‘ప్రివిలేజ్ పాస్‌లు’ వంటి అనేక సౌకర్యాలు వీరికి ఉంటాయి. ఉద్యోగ భద్రత, పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాల కారణంగా ప్రతి ఏటా లక్షలాది మంది ఈ ఉద్యోగం కోసం పోటీ పడుతుంటారు.
