ఆంబూర్: కుక్కకు వేయడం కోసం పక్కన పెట్టిన పాడైపోయిన చికెన్ కర్రీని ప్రమాదవశాత్తూ తినడంతో మూడేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా ఆంబూర్లో ఈ దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. కొబ్బరి తోటల్లో పనిచేసే కార్మికుడైన సతీష్ – శ్రేయ దంపతుల కుమార్తె భూమిక (3) ఈ ప్రమాదంలో మరణించింది. వీరి ఏడాదిన్నర వయసున్న రెండో కుమార్తె రేణుక కూడా తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
గత మే 10న ఇంట్లో వండిన చికెన్ కర్రీలో మిగిలిన భాగాన్ని కుక్కకు వేయడం కోసం కుటుంబ సభ్యులు పక్కన పెట్టారు. అయితే, రెండు రోజులుగా నిల్వ ఉండి పాడైపోయిన ఆ కూరను పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ తీసి తిన్నారు. కర్రీ తిన్న వెంటనే పిల్లలకు వాంతులు, ఇతర శారీరక రుగ్మతలు (అస్వస్థత) మొదలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ భూమిక ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఐసీయూలో చిన్నారి – ముమ్మర దర్యాప్తు
రెండో చిన్నారి రేణుక ప్రస్తుతం ఐసీయూ లో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. నిల్వ ఉన్న ఆహారం తినడం వల్ల సంభవించిన తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే చిన్నారి మరణించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేశామని, పిల్లల పోస్ట్మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు.
