మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలోని డబ్రా నగరంలో, కుటుంబ గొడవలో ఆగ్రహానికి గురైన ఒక భార్య, తన భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై మరిగే వేడినీళ్లు పోసి దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
డబ్రా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఈ దంపతులకు పిల్లలు లేరు. భర్తకు మద్యపాన అలవాటు ఎక్కువగా ఉండటంతో, వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజు రాత్రి కూడా మద్యం తాగి వచ్చిన భర్తతో భార్యకు వాగ్వాదం జరగగా, ఆగ్రహించిన భర్త ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ, నేరుగా వంటగదిలోకి వెళ్లి పప్పు ఉడకబెట్టడానికి మరిగిస్తున్న వేడినీళ్లను తీసుకువచ్చి, భర్త ప్రైవేట్ భాగంపై పోసింది. ఈ గొడవలో తన కొడుకును రక్షించడానికి వచ్చిన మామగారిపై కూడా ఆ వేడినీళ్లు పడటంతో ఆయన కూడా స్వల్పంగా గాయపడ్డారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త, “నాపై వేడినీళ్లు పోసిన తర్వాత, ఆ మహిళ బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయింది” అని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన డబ్రా సిటీ పోలీసులు, పరారీలో ఉన్న మహిళ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ కావడంతో, “కుటుంబ గొడవల్లో ఇంత దారుణంగానా.. డబ్బు, నగలతో పారిపోయిన ఆ మహిళను వెంటనే అరెస్టు చేయాలి!” అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
