కూతురు చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులు..! 27 నెలల తర్వాత సజీవంగా తిరిగొచ్చిన యువతి.. విచారణలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు..!!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో బీకేటీ ప్రాంతానికి చెందిన శివాని అనే యువతి.. 2024 మే 2న అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది.

ఆ తర్వాత జూలైలో ఓ కాలువలో గుర్తుతెలియని యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. ఆమె చేతికి ఉన్న గాజులు, ఉంగరాన్ని చూసిన శివాని తల్లిదండ్రులు.. ఆ మృతదేహం తమ కుమార్తె శివానిదేనని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

ఈ ఘటన అనంతరం శివాని భర్త కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, హత్య కేసు నమోదైంది. అయితే, మృతదేహం నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాలు శివాని తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోలలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీంతో కేసు రద్దు చేయబడింది.

ఇదిలా ఉండగా.. కనిపించకుండా పోయిన 27 నెలల తర్వాత, గత శనివారం శివాని అకస్మాత్తుగా సజీవంగా తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు.

శివానిని పోలీసులు విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరా ప్రాంతంలో ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ మరుగుదొడ్డి కేంద్రాన్ని చూసుకునే జావేద్ అనే వ్యక్తితో శివాని కొంతకాలంగా కలిసి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

జావేద్ పలుమార్లు ఇంటికి తిరిగి వెళ్లాలని శివానిని సూచించినప్పటికీ.. ఆమె మాత్రం ఇంటికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తన స్వచ్ఛంద నిర్ణయంతోనే తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

శివాని సజీవంగా తిరిగి రావడంతో పోలీసులు ఈ కేసును మరోసారి లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆమె స్వచ్ఛందంగానే ఇంటి నుంచి వెళ్లిపోయిందా? లేక ఎవరైనా ఆమెను అపహరించారా? అనే విషయాలపై స్పష్టత కోసం.. మేజిస్ట్రేట్ ఎదుట శివాని వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *