రాజంపేట: ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన వాడే కాలయముడయ్యాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్లెదుటే ఉరివేసుకుంటుంటే.. కాపాడాల్సింది పోయి, సెల్ఫోన్లో వీడియో తీస్తూ పైశాచికానందం పొందాడు. “సరిగా ఉరేసుకో కృష్ణా..” అంటూ నవ్వుతూ వెటకారం చేశాడు. తీరా ఆ వెటకారమే ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
ప్రేమ పెళ్లి.. కానీ నిత్యం గొడవలే
ఒంగోలుకు చెందిన శ్రీరాం శ్రీనివాసులు లోకోపైలట్‌గా పనిచేస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో, 2016లో నందలూరుకు చెందిన కృష్ణవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అయితే, శ్రీనివాసులు మద్యానికి బానిస కావడంతో ఆ పచ్చని సంసారంలో చిచ్చు రేగింది. నిత్యం గొడవలు, అవమానాలతో కృష్ణవేణి మానసికంగా కృంగిపోయింది. “చనిపోతాను” అని ఆమె ఆవేదనతో చెబుతున్నా, భర్త మాత్రం అది కేవలం బెదిరింపు అని హేళన చేసేవాడు.
మృత్యువుతో సరదా.. వెటకారపు వీడియో!
గురువారం మరోసారి గొడవ జరగడంతో కృష్ణవేణి తలుపు వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకోబోయింది. ఆ సమయంలో బయట ఉన్న శ్రీనివాసులు ఆమెను ఆపాల్సింది పోయి, కిటికీలోంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు.
“కృష్ణా.. భయం వేస్తోందా? సరిగా ఉరేసుకో.. సరిగా బిగించుకో” అంటూ నవ్వుతూ ఆమెను ఎగతాళి చేశాడు.
కృష్ణవేణి మంచంపై నుంచి దిగుతున్న క్రమంలో అనుకోకుండా ఉచ్చు బిగుసుకుపోయింది. ఊపిరి ఆడక ఆమె విలవిల్లాడుతుంటే, అప్పటికి గానీ భర్తకు అసలు విషయం అర్థం కాలేదు. హడావిడిగా తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పొరుగువారు వచ్చేసరికి ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కన్నీరు మున్నీరవుతున్న చిన్నారులు
తల్లి మరణం, తండ్రి చేసిన పని బయటపడటంతో ఆ ఇద్దరు పసిపిల్లలు అనాథలయ్యారు. ఈ దిగ్భ్రాంతికరమైన వీడియో బయటకు రావడంతో స్థానికులు శ్రీనివాసులుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
