కోల్‌కతా: ఐపీఎల్ (IPL)లో భారీ ధర పలికిన ఆటగాళ్లపై ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. కానీ, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ విషయంలో ఆ ఒత్తిడి ఇప్పుడు ‘ఆర్ధిక నష్టం’గా మారుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ ప్రదర్శన కేవలం పేలవమని అంటే సరిపోదు.. అది కేకేఆర్ బడ్జెట్‌కు ఒక హెచ్చరిక లాంటిది.
రూ. 8 కోట్ల భారీ లోటు
మా విశ్లేషణ ప్రకారం.. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో గ్రీన్ వల్ల కేకేఆర్‌కు సుమారు రూ. 8.01 కోట్ల నికర నష్టం వాటిల్లింది. ఈ రూ. 8 కోట్లు అంటే సామాన్యమైన అంకె కాదు. ఐపీఎల్ వేలంలో ఒక నాణ్యమైన టీమ్ ఇండియా ప్లేయర్‌ను కొనుగోలు చేసేంత మొత్తం. ఉదాహరణకు, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఐపీఎల్ కాంట్రాక్ట్ విలువ సరిగ్గా ఇదే బ్రాకెట్లో ఉంటుంది. అలాగే ముఖేష్ కుమార్, హర్షల్ పటేల్ వంటి మేటి బౌలర్ల ధర కూడా ఇదే!
సీఎస్కే మ్యాచ్‌తో బయటపడ్డ అసలు రంగు
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ ఘోరంగా విఫలమయ్యాడు.
- బ్యాటింగ్: ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ (0).
- బౌలింగ్: వికెట్లు లేవు, ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు.
- వాల్యూ: ఈ మ్యాచ్ ద్వారా జట్టుకు అతను అందించిన విలువ ‘సున్నా’.
అతని ఒక్కో మ్యాచ్ కాస్ట్ రూ. 1.8 కోట్లుగా పరిగణిస్తే, ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కు రూపాయి లాభం కూడా రాలేదు. ఐదు మ్యాచ్‌లు ముగిసేసరికి, గ్రీన్ కోసం కేకేఆర్ వెచ్చించిన రూ. 9 కోట్లకు గానూ, అతను తిరిగి అందించిన ప్రదర్శన విలువ కేవలం రూ. 99.14 లక్షలు మాత్రమే!
అవకాశ వ్యయం (Opportunity Cost) భారమేనా?
తిలక్ వర్మ వంటి ఆటగాడిని కొన్నప్పుడు ఏ జట్టుకైనా ఒక భరోసా ఉంటుంది. అతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో తన ఉనికిని చాటుతాడు. కానీ గ్రీన్ ప్రదర్శనలో స్థిరత్వం లేదు. లక్నోపై ఒక మ్యాచ్‌లో కాస్త మెరిసినా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఘోరంగా దెబ్బతిన్నాడు. ఒక విదేశీ ఆల్‌రౌండర్ కోసం రూ. 25.20 కోట్లు పోయడం అంటే.. అతను మ్యాచ్ విన్నర్ కావాలి. కానీ ప్రస్తుత లెక్కలు చూస్తుంటే, గ్రీన్ ఒక ‘లైబిలిటీ’ (భారం)గా మారుతున్నాడనిపిస్తోంది.
లెక్కలు ఎలా వేశాం?
మా గణాంక పద్ధతి ప్రకారం.. గ్రీన్ మొత్తం వేలం ధర రూ. 25.20 కోట్లను లీగ్ మ్యాచ్‌ల సంఖ్యతో (14) భాగిస్తే, ఒక్కో మ్యాచ్‌కు అతని ఖరీదు రూ. 180 లక్షలు (1.8 కోట్లు). అతని బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ గణాంకాలను బట్టి ప్రతి మ్యాచ్‌లో అతను జట్టుకు ఎంత విలువను తిరిగి ఇచ్చాడో లెక్కిస్తాం.
- ఐదు మ్యాచ్‌ల పెట్టుబడి: రూ. 9 కోట్లు
- గ్రీన్ అందించిన రిటర్న్స్: రూ. 99.14 లక్షలు
- నికర నష్టం: రూ. 8.01 కోట్లు
