తిరువనంతపురం: కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెరియన్ ఫిలిప్, కొల్లాం కొత్త ఎమ్మెల్యే బిందు కృష్ణను బహిరంగంగా బలవంతంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
బలవంతంగా హత్తుకోవడానికి ప్రయత్నించిన ఫిలిప్
కొల్లాం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన తర్వాత బిందు కృష్ణ కేపీసీసీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయానికి వచ్చిన బిందు కృష్ణ అక్కడ ఉన్నవారిని నమస్కారం చేస్తూ లేదా కరచాలనం (Handshake) చేస్తూ పలకరిస్తున్నారు. అదే సమయంలో చెరియన్ ఫిలిప్ ఎదురవ్వగా, బిందు ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచారు. కానీ, 71 ఏళ్ల ఫిలిప్ ఆమె కరచాలనాన్ని పట్టించుకోకుండా, ఎమ్మెల్యేను బలవంతంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు. బిందు కృష్ణ దీనివల్ల అసౌకర్యానికి లోనై వెనక్కి తగ్గినప్పటికీ, ఫిలిప్ ఆమె భుజం పట్టుకుని లాగి హత్తుకోవడానికి ప్రయత్నించారు. చివరకు బిందు కృష్ణ ఆయనను పక్కకు నెట్టివేసి అక్కడి నుండి ముందుకు సాగిపోయారు.
సోషల్ మీడియాలో ఆగ్రహం
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు చెరియన్ ఫిలిప్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. “ఈయన నిజంగానే అస్వస్థతతో ఉన్నారా?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు మహిళా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కార్యకర్త శ్రీజ నెయ్యాటింకర ఈ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. “బహిరంగంగా పరస్పర అంగీకారంతో కౌగిలించుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక మహిళా ప్రతినిధి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు, ఆమె అనుమతి లేకుండా బలవంతంగా ఒంటిపై పడటం సభ్యత అనిపించుకోదు” అని మండిపడ్డారు.
పాత వివాదాలను గుర్తు చేస్తున్న నెటిజన్లు
చెరియన్ ఫిలిప్కు వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో మహిళా కాంగ్రెస్ నేతలు ఎన్నికల టిక్కెట్లు పొందడానికి లైంగికంగా రాజీ పడతారనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పట్ల ఆయన చేసిన ఈ ప్రవర్తన ఆయనను మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఆయనను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
