తిరువనంతపురం: కేరళలో ఎవరూ నివసించకుండా తాళాలు వేసి ఉన్న ఇళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొద్దికాలం క్రితం వెలువడిన గణాంకాల ప్రకారం, ఇలా మూతపడిన ఇళ్ల సంఖ్య లక్షల్లో ఉంది.
కారణాలు ఏమిటి?
- యువత వలసలు: కేరళ యువత పెద్ద సంఖ్యలో యూరోపియన్ దేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడ పౌరసత్వం లభించిన తర్వాత తమ తల్లిదండ్రులను కూడా అక్కడికే తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఇక్కడ సొంత ఇళ్లకు తాళాలు పడుతున్నాయి.
- గల్ఫ్ దేశాల్లో ఆస్తుల కొనుగోలు: ఇటీవల కొన్ని గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు సొంతంగా ఇళ్లు లేదా అపార్ట్మెంట్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభించింది. దీంతో కేరళలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లు కేవలం సంవత్సరానికి ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు ఉండటానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి.
నిర్వహణ లేక శిథిలావస్థకు..
మనుషులు నివసించని ఇళ్లు త్వరగా పాడైపోవడం సహజం. సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. విదేశాల్లో ఉండేవారు కేరళకు వచ్చేటప్పుడు మాత్రమే తమ ఇంటి గురించి ఆలోచిస్తారు. ఆ సమయంలో ‘డీప్ క్లీనింగ్’ ఏజన్సీలను ఆశ్రయించి ఇంటిని తాత్కాలికంగా శుభ్రం చేయిస్తారు. కానీ, పైపైన మెరుగులు దిద్దడం వల్ల లోపల జరిగే నిర్మాణాత్మక నష్టం లేదా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కారం కావు. ఇలాంటి ఖరీదైన ఇళ్లు కేవలం సంరక్షణ లేక పాడైపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కొత్త వ్యాపార అవకాశం
ఇక్కడే ఒక కొత్త వ్యాపార అవకాశం కనిపిస్తోంది. కేవలం సెలవుల్లో వచ్చినప్పుడు క్లీనింగ్ చేయించడం కాకుండా, ఏడాది పొడవునా ఇంటిని చూసుకోవడానికి, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలు అవసరం.
- ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఏజెన్సీలు స్వల్పంగా పనిచేస్తున్నాయి.
- విదేశాల్లో ఉన్న యజమానుల తరపున ఇంటిని పర్యవేక్షించడం (Property Management) అనేది రాబోయే రోజుల్లో కేరళలో ఒక మంచి లాభదాయకమైన వ్యాపారంగా మారనుంది.
