ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీలో సోమవారం సాయంత్రం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 20 ఏళ్ల యువతికి అక్కడ డయాలసిస్ విభాగంలో చికిత్స అందించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో, వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించాలని వైద్యులు సూచించారు. డయాలసిస్ విభాగం నుండి ఎమర్జెన్సీ వార్డు అదే ప్రాంగణంలో కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది.
దీనికోసం ఆంబులెన్స్ డ్రైవర్‌ను కుటుంబ సభ్యులు సాయం కోరారు. అయితే, ఆ 400 మీటర్ల దూరానికి తాను రానని ఆ డ్రైవర్ అత్యంత దారుణంగా నిరాకరించినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక, కుటుంబ సభ్యులు ఆ యువతిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డుకు పరుగులు తీశారు.
దురదృష్టవశాత్తూ, సరైన సమయానికి చికిత్స అందకపోవడంతో ఆ యువతి మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, మెడికల్ కాలేజీ యాజమాన్యం సమగ్ర విచారణకు ఆదేశించింది.
