భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని ధరమ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సదైని గ్రామంలో, టమాటా ధర విషయంలో తలెత్తిన ఒక చిన్న వివాదం చివరకు ఘోరమైన హింసకు దారితీసింది.
హేత్రామ్ కోరి (30) అనే యువకుడు, ప్రహ్లాద్ కోరి అనే కూరగాయల వ్యాపారి వద్దకు వెళ్లి టమాటా ధర ఎంత అని అడిగాడు. మార్కెట్లో కిలో టమాటా ధర 50 రూపాయలుగా ఉండగా.. సదరు వ్యాపారి మాత్రం కిలో 80 రూపాయలు అని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంటిపైకి వెళ్లి లాఠీలతో దాడి – రక్తపు మడుగులో కస్టమర్:
ఇంతలా ధర పెంచి అమ్ముతున్నారేంటని ప్రశ్నించినందుకు వ్యాపారి ప్రహ్లాద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే అతను తన బంధువులైన రాంబాబు, రాజా, రాంకరన్ మరియు మున్ని కోరిలను ఒకచోటకు చేర్చుకుని.. చేతుల్లో లాఠీలతో (కర్రలతో) నేరుగా హేత్రామ్ కోరి ఇంటిపైకి దూసుకెళ్లాడు. అక్కడ వారంతా కలిసి హేత్రామ్పై కర్రలతో దారుణంగా దాడి చేయడంతో అతని తల పగిలి, రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అంతేకాకుండా, అడ్డువచ్చిన అతని కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామంటూ నిందితులు బెదిరింపులకు దిగారు.
ఆసుపత్రిలో బాధితుడు – ‘క్రాస్ కేసు’ నమోదు చేసిన పోలీసులు:
తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతను అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘోర సంఘటనపై సమాచారం అందుకున్న ధరమ్పూర్ పోలీసులు.. కూరగాయల వ్యాపారి ప్రహ్లాద్ మరియు అతని బంధువులతో సహా ఐదుగురిపై ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) చట్టంలోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే, ఈ గొడవకు సంబంధించి ఇరు వర్గాల నుండి ఫిర్యాదులు రావడంతో పోలీసులు ‘క్రాస్-కేస్’ (Cross-Case) నమోదు చేసి, ఘటనపై తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు.
