ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ ర్యాపిడ్ మెట్రో స్టేషన్ సమీపంలో సెప్టెంబర్ 19వ తేదీ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 24 ఏళ్ల తుషార్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు మొదట అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జన్ లేకపోవడంతో, ఆ తర్వాత ఇందిరాపురంలోని యశోద మెడిసిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో తుషార్‌కు చికిత్స అందించిన నేపథ్యంలో, కేవలం 30 నుంచి 35 నిమిషాల్లోపే రూ.47,800 బిల్లు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు అతని తండ్రి శివకుమార్ ఆరోపించారు. తన వద్ద అంత డబ్బు లేదని, కొడుకును ప్రభుత్వ ఆసుపత్రికి మార్చడానికి సహాయం చేయాలని కోరినా వారు తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆయన తెలిపారు.
దీంతో కొడుకు చికిత్స కోసం డబ్బు సమకూర్చుకోవడానికి తండ్రి కొన్ని గంటల పాటు తిరిగినట్లు తెలుస్తోంది. చివరకు అధిక వడ్డీకి రూ.70,000 అప్పు తీసుకుని, అందులో సుమారు రూ.45,000 ఆసుపత్రిలో చెల్లించినట్లు ఆయన చెప్పారు. ఆపై అంబులెన్స్ కోసం మరో రూ.6,000 ఖర్చు చేసి, తుషార్‌ను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
కానీ, చికిత్స పొందుతూ సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం తుషార్ మృతి చెందాడు. కొడుకును కాపాడుకోవడానికి భూమిని తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చినా, చివరకు కొడుకును కోల్పోయామని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, తండ్రి చేస్తున్న ఆరోపణలను యశోద మెడిసిటీ ఆసుపత్రి ఖండించింది. రోగికి అవసరమైన చికిత్సను వెంటనే అందించామని, కుటుంబ సభ్యులకు తగిన వైద్య సలహాలు కూడా ఇచ్చామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Leave a Reply